అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరైనా చిన్నారులకు సాయం చేయాలన్నా మన కథానాయకుల్లో చాలామంది ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యలు మహేష్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకున్న చిన్నారితో ఫొటో దిగి కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా మహేష్‌బాబు పలువురికి ఆర్థికసాయం చేశారు. అంతేకాదు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘ఫస్ట్ ఓథ్’పేరుతో సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణ స్వీకారం పాఠాన్ని విడుదల చేశారు. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. మహేష్ మాట్లాడుతుంటే అచ్చం కృష్ణ మాట్లాడినట్లే ఉందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ నడిచింది.