నాలుగేళ్లుగా ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా మోసం చేస్తూ వస్తుందో.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్క ఎలా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందో ప్రజలకు వివరించి.. టీఆర్ఎస్ సర్కార్‌పై యుద్ధం ప్రకటిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ స్పష్టం చేశారు.ఈ నెల 23 నుంచి జులై 6 వరకు బిజెపి తలపెట్టిన జన చైతన్య యాత్రను పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ.... కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలన్నీ మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న పార్టీలేనని విమర్శించారు.కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల అపవిత్ర కలయిక, అధికారం కోసం వాళ్లు పాకులాడుతున్న తీరు బట్టబయలైందని డాక్టర్ లక్ష్మన్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని,కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ కుటుంబమే అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారయిందని డాక్టర్ లక్ష్మన్ ఆరోపించారు.కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు టీఆర్ఎస్-బిజెపిల మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం లేదని, అలాంటి రహస్య ఒప్పందాలపై బిజెపికి ఎలాంటి విశ్వాసం లేదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న మోదీ ప్రభ, బిజెపి ప్రాబల్యాన్ని ఎదుర్కోలేక.. ముఠాలు కట్టి బిజెపిని నిలువరించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఓటమి పాలవుతామో అన్న భయంతోనే ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని, ఇటీవల రైతుబంధు పథకం ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అందులోని లోపాలను మాత్రం సవరించడం లేదన్నారు.బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను మభ్యపెట్టేలా, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.తమకు జరుగుతున్న అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు రగిలిపోతున్నారని, టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.తమ హక్కుల కోసం, ప్రయోజనాల కోసం ప్రశ్నించేవారిని ఈ సర్కార్ నిర్బంధాలతో అణచివేస్తుందని, టీఆర్ఎస్, కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ పళ్లెత్తు మాట మాట్లాడటం లేదని, ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీ తీసుకెళ్లలేదని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు.బీసీ సబ్ ప్లాన్, బీసీల వర్గీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని, అలాగే ముస్లింలను బీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలు తిరగబడతారని డాక్టర్ లక్ష్మన్ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజు మినహాయింపు విషయంలో బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, బీసీ విద్యార్థులు చేసిన పాపం ఏమిటని డాక్టర్ లక్ష్మన్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ తీవ్ర కృషి చేస్తున్నారని, 2022 వరకు అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో ముందుకు పోతున్నారని, మోదీ ప్రభుత్వం ఇవాళ 7 కోట్ల మందికి ఇళ్లను ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి 1 లక్షా 25 వేల ఇళ్లు మంజూరు చేసిందని, 1 వేయి 316 కోట్ల నిధులు ఇచ్చిందని కానీ.. రాష్ట్ర ప్రభుత్వం అందులో ఎన్ని నిధులను ఖర్చు చేసిందో చెప్పాలని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. కేంద్రం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు..ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు బిజెపి ఈ జనచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిందని డాక్టర్ లక్ష్మన్ పునరుద్ఘాటించారు.ప్రజా సమస్యలను పక్కనపెట్టి కుర్చీ కోట్లాటలతో కాంగ్రెస్ ఢిల్లీ యాత్ర కొనసాగిస్తుందని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా..., ప్రజా సంక్షేమ పథకాల ఫలితాలు పేదలకు చేరువై, పేదలు అభివృద్ధి చెందాలన్నా... కేవలం మోదీ పాలనతోనే సాధ్యమన్న అభిప్రాయంతో ఈ దేశ ప్రజలున్నారని, బడుగు, బలహీన వర్గాలు,కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.రేపటినుంచి తలపెట్టిన యాత్‌ాను విజయవంతం చేసేందుకు, బిజెపికి మద్ధతు తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు.