ఏటీఎమ్‌ల సెక్యూరిటీ విషయంలో బ్యాంకులు అలసత్వం వహించడం పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశిత గడువులోపు ఏటీఎమ్‌లను అప్‌గ్రేడ్ చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు వచ్చే ఆగస్టునాటికి సెక్యూరిటీపరమైన చర్యలను బ్యాంకులు అమలు చేయాలి. అంతేకాకుండా వచ్చే ఏడాది జూన్ నాటికి అన్ని ఏటీఎమ్్‌లను సరైన ఆపరేటింగ్ సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి దేశవ్యాప్తంగా 2.06 లక్షలకు పైగా ఏటీఎమ్‌లున్నాయి. వీటిల్లో 30% యంత్రాలు పాత సాఫ్ట్‌వేర్‌తో నడుస్తున్నాయి. నిర్వహణలో ఉన్న ఏటీఎమ్‌లలో విండోస్ ఎక్స్‌పి లేదా సపోర్ట్ చేయని ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం పట్ల గత ఏడాది ఏప్రిల్‌లో ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని బ్యాంకుల దృష్టికి కూడా తీసుకువెళ్లింది. సెక్యూరిటీ పరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చినా.. వాటిని అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేంద్ర బ్యాంకు తాజా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బ్యాంకులు, వైట్ లేబుల్ ఎటిఎం ఆపరేటర్లు.. బిఐఔస్ పాస్‌వర్డ్ సదుపాయంతోపాటు యుఎస్‌బి పోర్ట్‌లు, ఆటో రన్ సదుపాయాన్ని పని చేయకుండా చేయాలి. సాఫ్ట్‌వేర్‌లో లోపాలుంటే సరిదిద్దాలి. టెర్మినల్ సెక్యూరిటీ సొల్యూషన్, సమయాధారిత అడ్మిన్ యాక్సెస్ వంటి సదుపాయాలని ఆగస్టు నాటికి అమలు చేయాల్సి ఉంటుంది. యాంటీ స్కిమ్మింగ్, వైట్ లిస్టింగ్ సొల్యూషన్‌ను వచ్చే ఏడాది మార్చి వరకు అమలు చేయాలి. అన్ని ఏటీఎమ్‌లు కూడా సరైన ఆపరేటింగ్ సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న ఏటీఎమ్‌లలో 25 శాతం ఎటిఎంలను సరైన అపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే సెప్టెంబరు నాటికి అప్‌గ్రేడ్ చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. డిసెంబరు నాటికి ఇది 50 శాతం వాటిల్లో పూర్తవ్వాలి. వచ్చే ఏడాది జూన్ నాటికి మొత్తం ఏటీఎమ్‌లు అప్‌గ్రేడ్ కావాలి. తాము జారీ చేసిన సర్క్యులర్‌ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని, నిర్దేశిత చర్యలను అమలు చేయడానికి ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళికను కూడా బోర్డు ముందుంచాలని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ వివరాలను జూలైనాటికి తమకు తెలియజేయాలని కూడా బ్యాంకులను ఆదేశించింది. గడువు లోపు తమ ఆదేశాలను పాటించనట్లయితే పెనాల్టీని కూడా విధించాల్సి వస్తుందని ఆర్బీఐ హెచ్చరించింది.