ఏమీ లేని చోట ఏం చేస్తే ఏం ఉంది? ఒక ప్రయోగం చేద్దాం. వర్క్ అవుట్ అయితే మంచిదే. లేకుంటే పోయేదేమీ లేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన.ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. మక్కల్ నీది మయ్యమ్ అధినేత, సినీనటుడు కమల్ హాసన్ ఢిల్లీలో వరుసగా టెన్ జన్ పథ్ కు వెళ్లడం చర్చనీయాంశమైంది. కమల్ హాసన్ బీజేపీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అలాగని కాంగ్రెస్ ను ఇంతవరకూ సమర్థించలేదు. అయితే తాజాగా కమల్ హసన్ సోనియా, రాహుల్ తో విడివిడిగా భేటీ కావడం తమిళనాడులో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కూడా కమల్ హాసన్ సాయం తమిళనాడులో తీసుకోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో కనీస సీట్లను సాధించుకోగలిగితే ప్రభుత్వ ఏర్పాటులో ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.తమిళనాడులో బలమైన మిత్రుడుగా డీఎంకే కాంగ్రెస్ కు ఉండనే ఉన్నారు. అయితే కరుణానిధి ఆరోగ్యం బాగా లేక ఇంటికే పరిమితమవ్వడంతో ఇప్పుడు పార్టీ వ్యవహారాలన్నింటీని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ చూస్తున్నారు. స్టాలిన్ కు కరుణానిధి అంత పట్టులేదు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనూ స్టాలిన్ తన సత్తా చూపలేకపోయాడంటున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో మహాకూటమిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అతిపెద్ద రాష్ట్రం కావడంతో అధిక స్థానాలు దక్కించుకోవాలన్నది ఆ పార్టీ ఆలోచన.తమిళనాడులో డీఎంకే కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. క్యాడర్ ఉంది. దీనికి తోడుగా కమల్ హాసన్ ను కూడా కలుపుకుని వెళితే మరింత బలపడవచ్చన్నది రాహుల్ ఆలోచనగా ఉంది. అందుకే కమల్ హాసన్ కు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వడమే కాకుండా ఎక్కువ సమయాన్ని ఆయనకు కేటాయించారు. రాహుల్ తర్వాత సోనియా కూడా కమల్ ను కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీకి సినీనటి, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రచార ప్రతినిధిగా ఉన్న ఖుష్బూ కమల్ హాసన్ కు సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ ఇప్పించారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలసి పోటీ చేయకపోయినా రెండాకులేనన్న సంగతి అందరికీ తెలసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో మంచి క్రేజ్ ఉన్న కమల్ ను దగ్గరకు తీసుకోవాలన్నది కాంగ్రెస్ భావన. అయితే డీఎంకే నేతలు తమకు తెలియడకుండానే కమల్ కాంగ్రెస్ అధినాయకత్వంతో కలవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తో కొన్నేళ్లుగా నమ్మకంగా మిత్రత్వాన్ని కొనసాగిస్తున్న తమను కాదని కమల్ ను చేరదీయడంపై ఆ పార్టీ సీరియస్ గా ఉంది. అయితే కమల్ తో రాజకీయపరమైన అంశాలు చర్చించలేదని కాంగ్రెస్ నేతలు నచ్చజెబుతున్నారు. మొత్తం మీద వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో మహాకూటమి ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ఆలోచన ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.