సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్న చందాన కేంద్ర సర్కారు సొమ్ముతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర సర్కారు ఏపీకి ఏమీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్, దుగరాజ పట్నం పోర్టు, కడప ఉక్కు పరిశ్రమలకు సంబంధించి విభజన చట్టంలో పరిశీలన చేయమని మాత్రమే ఉందని అన్నారు.సాక్షర భారత్ ప్రాజెక్టు విషయంలోనూ రాష్ట్ర సర్కారు అభ్యంతరకరంగా వ్యవహరిస్తోందని, దాన్ని కొత్త పథకంలో విలీనం చేసినందున కేంద్ర సర్కారు కొత్త ప్రపోజల్స్ పెట్టమంటే పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 20 వేల మంది ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడిలా నరేంద్ర మోదీ మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి, ప్రధాని కాలేదని, ఆయన ప్రజల సహకారంతో కష్టపడి ఎదిగారని చురకలంటించారు.