- పైలాన్ ఆవిష్కరించిన వైఎస్ జగన్
- రాయలసీమలో ప్రజాసంకల్పయాత్ర పూర్తి
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను సావధానంగా వింటూ వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రాజన్న తనయుడిగా ప్రజామోద పాలన అందిస్తామని భరోసానిస్తూ ముందుకెళ్తున్నారు. స్ఫూర్తిదాయక హామీలతో కొనసాగుతున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో జననేతకు బాసటగా ‘వాక్ విత్ జగన్’ అంటూ వేలాదిమంది పాదయాత్రలతో ఉరకలెత్తారు. కాగా గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఘాట్ నుంచి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.