ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై ఇంటెలిజెన్సీ అధికారులు నివేదిక రూపొందించి రాష్ట్రప్రభుత్వానికి పంపించగా, మరోపక్క సీనియర్ మాజీ జర్నలిస్టులు, ప్రైవేటు వ్యక్తుల చేత ముఖ్యమంత్రి సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇన్‌ఛార్జులు కలవరపడుతున్నారు. ఈనెల 26వ తేదీన ముఖ్యమంత్రితో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జులు విడివిడిగా సమావేశం కానున్నారు. ఈనేపధ్యంలో ముఖ్యమంత్రి వారి జాబితా చిట్టాను విప్పి బాగుంటే గుడ్ సర్ట్ఫికెట్ ఇచ్చి రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించనున్నట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు అధికార, ప్రతిపక్షానికి అత్యంత కీలకం కావడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఈనేపథ్యంలో ప్రతి నియోజకవర్గాన్ని జల్లెడ పట్టే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారు. సర్వేల నివేదికలు ముఖ్యమంత్రి వద్ద ఉండడంతో తెలుగుతమ్ముళ్లు ఇప్పటి నుండే ఆందోళన చెందుతున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నివేదికలు బాగా లేకుంటే అభ్యర్ధులను సైతం మార్చేందుకు ముఖ్యమంత్రి వెనుకాడని పరిస్థితి ఉండడంతో వారందరూ ఈనెల 26వ తేదీన జరిగే సమావేశం ఏవిధంగా ఉంటుందోనన్న ఉత్కంఠతో ఉన్నారు. ప్రధానంగా జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఐదు నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధులు, నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు గెలుపొందుతారని నిఘా వర్గాలు రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు పంపించారు. అదేవిధంగా మరో మూడు నియోజకవర్గాల్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు ఉందని ఆ సర్వేలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, నిఘా వర్గాల సర్వే ఆవిధంగా ఉండగా ముఖ్యమంత్రి నిర్వహించిన సర్వే ఏవిధంగా ఉందో అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఈ రెండు సర్వేల ఆధారంగా శాసనసభ్యులు, ఇన్‌చార్జులపై ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో ముఖ్యమంత్రి విడివిడిగా సమావేశమయ్యారు. కాగా, ఈనెల 26వ తేదీన జరిగే సమావేశానికి వారిద్దరు కూడా హాజరవుతారో, లేదో వేచిచూడాల్సి ఉంది. పశ్చిమప్రాంతంలో మాత్రం తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటంతో ముఖ్యమంత్రి సైతం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి అవసరమైతే కొంతమంది శాసనసభ్యులను మార్పు చేసేందుకు కూడా సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా సహకార రంగాన్ని తెలుగుతమ్ముళ్లు నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పిడిసిసి బ్యాంకు, ఒంగోలు డెయిరీ వ్యవహారాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని సర్వేల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా అధికార తెలుగుదేశంపార్టీలోని నేతల మధ్య అంతరాలు పెరిగిపోయి ఒకరిమీద మరొకరు విమర్శలు చేసుకునే పరిస్థితులు ఇటీవలకాలంలో నెలకొన్నట్లు సమాచారం