YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతి బాండ్లకు క్రిసిల్ రేటింగ్

అమరావతి  బాండ్లకు క్రిసిల్ రేటింగ్
రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2 వేల కోట్ల విలువ చేసే అమరావతి బాండ్లకు ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఎ+ రేటింగ్‌ ఇచ్చింది. రాజధాని బాండ్లలో మదుపరులు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు క్రిసిల్‌ రేటింగ్‌ ఉపయోగపడుతుందని సీఆర్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బాండ్ల ద్వారా రూ.రెండు వేల కోట్ల వరకు సమీకరించాలని సీఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే అరేంజర్ల నియామకం పూర్తి చేసి మార్కెట్‌లోకి వెళ్లాలని సీఆర్‌డీఏ యోచిస్తోంది. ఈ బాండ్లకు సంబంధించి సీఆర్‌డీఏ లోగడే బ్రిక్‌వర్క్‌, స్మెరా సంస్థలతో రేటింగ్‌ ప్రక్రియ నిర్వహించింది. ఆ రెండు సంస్థలూ ఏఏ- రేటింగ్‌ ఇచ్చాయి. క్రిసిల్‌ వంటి అగ్రశ్రేణి సంస్థల రేటింగ్‌ ఉంటే బాండ్లకు మార్కెట్‌లో మరింత ఆకర్షణ పెరుగుతుందన్న నిపుణుల సూచన మేరకు ఆ ప్రక్రియనూ సీఆర్‌డీఏ పూర్తి చేసింది.ఈ బాండ్లకు సంబంధించి గత నెలలో ముంబయిలో సీఆర్‌డీఏ నిర్వహించిన మదుపరుల సమావేశానికి సుమారు 70 మంది హాజరయ్యారు. మరోవైపు అరేంజర్ల ఎంపికకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. సీఆర్‌డీఏ విడుదల చేసే బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీనిస్తోంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్ల మేరకు వివిధ బాండ్ల ద్వారా సమీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. ఈ జారీచేస్తున్న బాండ్లతో పాటు ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘అమరావతి బాండ్లు’ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది ముందుకొచ్చి ప్రతి రోజూ తనకు విరాళాలు అందిస్తున్నారని, ఈ నిధుల సేకరణను సక్రమంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరసయ్య అనే వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి నేరుగా తన దగ్గరకు వచ్చి రాజధాని నిర్మాణం కోసం చెక్ ఇచ్చి వెళ్లాడని, మరొకరు తన రెండు నెలల పింఛను అందించారని, ఒక ప్రవాస మహిళ తనకోసం చాలా సేపు వేచి వుండి రూ.10 లక్షలు చెక్ ఇచ్చి వెళ్లారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు

Related Posts