YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఖరీఫ్ కు రెడీ అవుతున్న అన్నదాతలు

ఖరీఫ్ కు రెడీ అవుతున్న అన్నదాతలు
గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వాతావరణం అనుకూలించక కష్టాలు, నష్టాలు చవిచూసిన అన్నదాతలు ఇప్పుడు రాబోయే ఖరీఫ్‌కు సన్నద్దమవుతున్నారు. తొలకరి జల్లులకు స్వాగతం పలకడానికి ముందే క్షేత్ర స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే రైతు ఇంట సిరుల పంట పండుతుంది. ముందుస్తు జాగ్రత్తలతో, ప్రణాళికబద్దంగా సేద్యం చేసుకునే రైతులు అధిక దిగుబడులు, ఆదాయం పొందాలంటే వ్యవసాయశాఖ శాస్తవ్రేత్తల, వ్యవసాయశాఖాధికారుల సూచనలను పాటిస్తే మంచిగా ఆశించిన ఫలితాలు వస్తాయి. వీటి మచ్చుకకు ముఖ్యమైన అంశాలు ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధమయ్యే రైతులు వెంటనే పొలంలో లోతు దుక్కులు చేసుకుంటే తొలకరి నాటికి భూమి సిద్ధంగా ఉంటుంది. లోతుగా దుక్కి దున్నడం వల్ల భూమిలో దాగి ఉండి పంటలకు హాని చేసే శిలీంధ్రాలు, బాక్టీరియా నాశనమవుతాయి. కొన్ని శత్రు పురుగులు కూడా చనిపోతాయి. అంతేకాక లోతు దుక్కులు చేస్తే భూమికి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దుక్కుల వల్ల కలుపు సమస్యను కూడా చాలా వరకూ నివారించుకోవచ్చు.
భూసార పరీక్షలు కీలకం: సాగు చేసే భూమిలో ఏఏ పోషకాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పరీక్షలను బట్టి లోపించిన పోషకాలను రైతులు ఎరువుల రూపంలో భూమికి అందించవచ్చు. మంచి దిగుబడుల్ని, ఆదాయాన్ని పొందవచ్చు. రైతులు కొన్ని ఎరువుల్ని అవసరానికి మించి వాడుతుంటారు. మరికొన్ని ఎరువులు అవసరమైనప్పటికీ వాటిని వేయరు. భూసార పరీక్షల ద్వారా ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. భూమిలో పోషకాల సమతుల్యతను కాపాడాలన్నా, రైతులు ఆయా పైర్లకు వేసే రసాయాన ఎరువులు సక్రమంగా వినియోగపడాలన్నా మట్టి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమతుల ఎరువుల వాడకం భూసార పరీక్షల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. భూసార పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు వ్యవసాయశాఖ ద్వారా పరీక్ష చేయించుకోవచ్చు. భూసారాన్ని పెంచడంతో పాటు భూ భౌతిక ధర్మాలపై ప్రభావం చూపేవే పచ్చిరొట్ట ఎరువులు. వీటివల్ల సూక్ష్మజీవులు విస్తారంగా అభివృద్ధి చెంది పంటలకు ఎంతో మేలు చేస్తాయి. జనుము, జీలుగ, పిల్లిపెసర, మినుము, పెసర, అలసంద... ఇన్నీ పచ్చిరొట్ట పైర్లే. వీటిని పొలంలో చల్లుకొని భూమిలో కలియదున్నుకోవాలి. వరిసాగు చేసే రైతులు జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను వేసుకుని పూత దశకు వచ్చినప్పుడు వాటిని కలియదున్నితే భూమికి ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని లభిస్తుంది. తద్వారా ఎరువులపై అయ్యే వ్యయాన్ని రైతులు తగ్గించుకోవచ్చు. పంటమార్పిడి ప్రక్రియ కూడా కీలకమైనదే. వరి తర్వాత అపరాలు, నూనెగింజల పంటలు వేసుకుంటే మంచిది. విత్తనాల కోసం హైరానా, అవస్థలు పడే రైతులు వాటిని తమ పొలంలోనే తయారు చేసుకోవచ్చు. తద్వారా ఖర్చును, శ్రమను తగ్గించుకోవచ్చు. తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసే రైతులు కొన్ని మెళకువలు పాటిస్తే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేసుకోవచ్చు. తమ పొలంలో నాణ్యమైన విత్తనాలను తయారు చేయడానికి కొంత స్థలాన్ని కేటాయించుకోవాలి. ముఖ్యంగా వరిలో రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకోవాలంటే దూరదూరంగా నాట్లు వేసుకోవాలి. కల్తీలను నివారించాలంటే వివిధ వరి రకాలను దూరదూరంగా పండించాలి. పైరు తొలి దశలో ఉన్నప్పుడు మొక్కల ఎత్తు, ఆకారాన్ని గమనించాలి. మొక్కలన్నీ ఒకే ఎత్తు, ఒకే ఆకారం ఉండేలా చూసుకోవాలి. ఏపుగా పెరిగిన మొక్కల్లో వేరే రకానికి చెందిన మొక్కల్ని గుర్తించి వాటిని ఏరివేయాలి. అనే విధంగా ఇతర పంటల మొక్కల్ని కూడా పీకేయాలి. పైరు దుబ్బు కట్టే సమయంలో వచ్చే తేడాలు, పూత దశలో గింజ రంగులో చోటు చేసుకునే మార్పుల్ని ఎప్పటికప్పుడు గుర్తించాలి. పొలంలో గట్టు చుట్టూ 5 మీటర్లు విస్తీర్ణం వదిలి లోపలి పొలం నుండి విత్తనాలు సేకరించాలి. పైరు కోసినప్పటి నుండి ఇతర విత్తనాలతో కలపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పక్క పొలాలకు దూరంగా నూర్పిడి చేసుకోవాలి. నూర్పిడి చేసిన తర్వాత ధాన్యంలో తప్ప, తాలు గింజలు, మట్టి పెళ్లలు తదితర పదార్థాలు లేకుండా చూసుకోవాలి. విత్తనాలను బాగా ఆరబెట్టాలి. నీరెండలో విత్తనాలు ఆరబెట్టడం మంచిది. ఎక్కువ వేడి తగిలితే విత్తనంలో పగుళ్లు వచ్చి జీవశక్తి తగ్గుతుంది. విత్తనాలను సురక్షితమైన సంచుల్లో నిల్వ చేసుకోవాలి. కలుపు నివారణ, నీటి వినియోగం, చీడపీడల నివారణకు సంబంధించి అవసరమైన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టాలి. పైరులో మిత్ర పురుగులు, శత్రు పురుగుల నిష్పత్తిని గమనిస్తూ అవసరమైన మేరకు మాత్రమే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పంట కోత దశలో తేమశాతాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది.

Related Posts