తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠా అభిషేకానికి టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఉత్సవ మూర్తి మలయప్ప స్వామివారికి మలయ కునియ నిన్ర పెరుమాల్ అనే పేర్లు ఉన్నాయి. మలయప్ప స్వామి వారి విగ్రహం 14 అంగుళాల పద్మపీఠంపై మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవారి విగ్రహాలు 4 అంగుళాల పీఠంపై 30 అంగుళాల ఎత్తు ఉంటాయి. మలయప్ప స్వామికి కుడివైపున శ్రీదేవి, ఎడమ వైపున భూదేవి ఉంటారు. తరతరాలుగా అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాలు నిర్వహిస్తున్న కారణంగా శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామివారి విగ్రహాలు తరిగి పోకుండా, అరిగి పోకుండా టీటీడీ ప్రతి సంవత్సరం ఈ జేష్ఠ్యాభిషేకాన్ని నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షణలో ఉన్న కల్యాణ మండపంలో మూడు రోజుల పాటు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ, అనంతరం చతుర్మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ముందుగా రుత్విక్కులు యాగశాలలో శాంతి హోమం నిర్వహిస్తారు. శత కలశ ప్రతిష్ట, ఆవాహన, నవకలశ ప్రతిష్ట, ఆవాహన, కంకణ ప్రతిష్ట అనంతరం కంకణ దారణ చేస్తారు. అనంతరం పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలతో పాటు ఇతర వేద పారాయణ పఠిస్తారు. ఈ క్రమంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులు తొలి రోజు వజ్ర కవచం, రెండో రోజు ముత్యాల కవచంతో, మూడో రోజు సాయంత్రం స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిస్తారు. తిరిగి వచ్చే ఏడాది జరిగే జ్యేష్ఠ్భాషేకం వరకు సంవత్సరం అంతా స్వామి, అమ్మవార్లు బంగారు కవచంతోనే ఉంటారు