తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాలపై దృష్టి పెట్టనున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతోనూ, ఎన్డీఏతోనూ తెగదెంపులు చేసుకోవడం, మరోవైపు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని వంటి పనులు చురుగ్గా సాగకపోవడం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు గుర్రాన్ని ఎక్కాలనుకున్న చంద్రబాబుకు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు చంద్రబాబుకు మరింత టెన్షన్ ను పెంచుతున్నాయి. ప్రజల సంగతి పక్కన పెడితే నేతలు తమలో తామే ఓడించుకుంటారేమోనన్న భయం వెంటాడుతోంది. అందుకే ఆయన ఇక పార్టీకోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలని నిర్ణయించారు.ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశాలు కూడా ఆయనకు సంతృప్తి నివ్వలేదు. తన ముందు తలాడించి తీరా జిల్లాలకు వెళ్లిన తర్వాత యధాస్థితి ఉండటాన్ని చంద్రబాబు గమనించారు. ఇందుకోసం ఇక ప్రతి వారం ఒక్కో జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలుంటాయి. రెండురోజుల్లో ఒకరోజు పూర్తిగా గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారు.గ్రామదర్శిని కార్యక్రమంలో గ్రామాలను పర్యటించి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు విపక్షం చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ, వైసీపీ, బీజేపీ సంబంధాలను కూడా వివరించనున్నారు. ఇక రెండోరోజు పూర్తిగా ఆ జిల్లా నేతలతో గడుపుతారు. వారికి పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రంలోనే చంద్రబాబు పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. దీనివల్ల వాస్తవ విషయాలు బయటకొస్తాయని, అవసరమైతే విడివిడిగా మాట్లాడటానికి కూడా చంద్రబాబు రెడీ అయ్యారు.ఇప్పటికే తెలుగుదేశం పార్టీని విడిచి కొందరు నేతలు వెళ్లిపోతున్నారు. ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం తీసుకుంటే తనకు సరైన గుర్తింపు, గౌరవం లభించలేదనే వెళ్లిపోయానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న నేతలకు తానే స్వయంగా భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రులు వాస్తవ విషయాలను తనకు తెలియజెప్పడం లేదని భావిస్తున్న చంద్రబాబు నేరుగా తానే వారితో మాట్లాడి పార్టీని సరైన గాడిలో పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు వచ్చే వారమే ముహూర్తంగా నిర్ణయించారు. మొత్తం మీద చంద్రబాబు పార్టీలో ఉన్న అసంతృప్తిని ఏమేరకు పారదోలగలరో వేచి చూడాల్సిందే.