- మనిషిని విజయాల వైపు నడిపిస్తుంది!
జననం, మరణం మధ్య పరిణామ క్రమ వికాసమే జీవితం. పుట్టడం, గిట్టడం- రెండూ ఉభయ సంధ్యల వంటివి. ప్రతి ప్రాణికీ ముగింపు తప్పదు. సృష్టిలో శ్రేష్ఠుడిగా భావించే మానవుడికి అనివార్యమైన సృష్టిధర్మమిది. అతడు ఈ భూమిమీద ఉన్నంత వరకు ఉత్సాహాన్ని వీడకూడదు. అదే వూపిరిగా జీవనయానం సాగించాలి.
ప్రయత్నం, ఉత్సాహం- రెండింటినీ అన్వయించుకున్నప్పుడే జీవితం ఎంతో ప్రభావితమవుతుంది. ఏ పని సాధించాలన్నా ఆ రెండూ అవసరమవుతాయి. అప్రయత్నంగా ఏదీ మనిషి చెంతకు రాదు. పరీక్షల్లో ఉత్తమ శ్రేణి పొందడానికి విద్యార్థి కష్టపడి చదవాలి. క్రమశిక్షణాయుత మార్గంలో ముందుకు సాగాలి. అప్పుడే అతడు విజయుడవుతాడు. అది అతడిలో మరెంతో శక్తి కలిగించి ఎన్నో విజయాలు పొందేలా చేస్తుంది. లక్ష్యం వైపు ఉద్యమించేందుకు స్ఫూర్తి, పట్టుదల మానవుడికి ఉత్సాహం వల్లనే లభిస్తాయి.
పనికి సంబంధించి, విజయం వరించవచ్చు. వరించకపోవచ్చు. మనిషి అంచనాలన్నీ తలకిందులు కావచ్చు. కానీ, పనిలో అతడి ప్రయత్నలోపం ఉండకూడదు.
ఆశ, నిరాశల మధ్య దోబూచులాడేదే జీవితం. ఒకటి ఉత్తేజానికి, మరొకటి నిస్తేజానికి ప్రతీకలు. నిరాశ ఆవరించినప్పుడు మనిషి కార్యశూన్యుడవుతాడు. అతడిలో వివేచన, ఆలోచనాశక్తి నశిస్తాయి. ఆ దశలోనే ఎంతో మానసిక శక్తి అవసరమవుతుంది. అలాగని పొంగి పొర్లేంత ఉత్సాహం, వూబిలో కూరుకుపోయేంత నిరుత్సాహం- రెండూ సరికావు. ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొనే శక్తి కొరవడటం వల్ల, కొంతమంది తమ జీవితాల్నే అంతం చేసుకుంటున్నారు. ఇది తమను తాము చేజార్చుకోవడమే! మాట్లాడే శక్తి, భావ వ్యక్తీకరణ, నాగరికత, అన్నింటినీ మించి మేధస్సు వల్ల మానవుడే అన్ని ప్రాణులకన్నా మిన్నగా ఉంటాడు. అటువంటి జీవితాన్ని అతడు దుఃఖమయం చేసుకోకూడదు. సుఖదుఃఖాల్ని సమదృష్టితో చూడగలగాలి. కష్టనష్టాలు ఎదురైనప్పుడు, అతణ్ని మనోనిబ్బరమే కాపాడుతుంది.
ఎప్పటికప్పుడు ఉత్సాహం పాళ్లను పెంచుకుంటూ జీవించడమే మనిషిని విజయాల వైపు నడిపిస్తుంది!