దేశంలో మనమే ముందున్నామని, ప్రపంచానికే నెంబర్ వన్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు మన రాష్ట్రం కేంద్రం కావాలన్నారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, ప్రాజెక్టుల పూర్తిపైనే దృష్టి పెట్టాలన్నారు. నరేగాలో గత 3 నెలల్లో రూ.2400 కోట్ల పనులు చేశామని పేర్కొన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ‘వృక్షమిత్ర’లను ప్రోత్సహించాలని అధికారులను సూచించారు. ఖరీఫ్లో రైతులకు ఎరువులు, పంట రుణాలు అందించాలని, సూక్ష్మ పోషకాలు ఉచితంగా అందజేయాలన్నారు. రైతులకు విత్తనాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గత ఏడాది కన్నా వ్యవసాయ దిగుబడులు పెరగాలని సీఎం అన్నారు పదిహేను శాతం సగటు వృద్ధిరేటు సాధించాలన్నారు. వ్యవస్థలను పటిష్టంగా నిర్మించామని, సుస్థిరపరచాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం రావాలన్నారు. నాలుగేళ్లలో మనం చేసిన పనులకు ఫలితాలొస్తున్నాయని, ఈ ఏడాది రాష్ట్రానికి 60కి పైగా అవార్డులు రావడం నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి, జలవనరులు, ఐటీశాఖల్లో అనేక అవార్డులు వచ్చాయన్నారు. మిగిలిన రాష్ట్రాలకు సగటున 20-30 అవార్డులే వచ్చాయన్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి, జలవనరులు, ఐటి శాఖల్లో అనేక అవార్డులు వచ్చాయని, అవార్డులు సాధించిన అందరికీ త్వరలోనే అభినందన సత్కారం ఉంటుందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో అన్ని శాఖలు ఒకదానితో మరొకటి పోటీ పడాలని సూచించారు. రెండంకెల వృద్ధిరేటు కొనసాగాలని ఆదేశించారు. అవార్డులు సాధించిన అందరికీ త్వరలోనే అభినందన సత్కారం చేస్తామన్నారు. భవిష్యత్లో అన్ని శాఖలు ఒకదానితో మరొకటి పోటీపడాలన్నారు.