- బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదు
- ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
- ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే : లక్ష్మి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. మిర్చి బండి దగ్గర జరిగిన చిన్న గొడవే శ్రీనివాస్ హత్యకు దారితీసిందన్నారు. శ్రీనివాస్‌ది కేవలం యాదృచ్చికంగా జరిగిన హత్యేనని ఎస్పీ పేర్కొన్నారు. ఈ హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాంబాబు, మల్లేష్, శరత్‌లను ప్రధాన నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
రాజకీయ హత్యే : శ్రీనివాస్ భార్య లక్ష్మి
ఇంట్లో నుంచి పిలిపించి మరీ తన భర్తను హత్య చేశారని శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మి అన్నారు. చిల్లర గొడవను సాకుగా చూపుతూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని తెలిపారు. ఈ హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. మంచి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి మిర్చి బండి దగ్గర చిల్లర గొడవ ఎందుకు చేస్తారని లక్ష్మి అన్నారు.