గత ఎన్నికల సమయంలో చావు దెబ్బతిన్న ఏపీ కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పట్టుసాధించాలని, కుదిరితే పూర్వ వైభవం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తన ఓటు బ్యాంకును తిరిగి సాధించేందుకు సర్కస్ ఫీట్లను సిద్ధం చేసుకుంటోందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా సీఎం కుర్చీకోసం పోరుకు సిద్ధమైన నేపథ్యంలో.. నేరుగా రంగంలోకి దిగి.. తన పరిస్థితి ఏంటో తేల్చుకోవాల్సిన కాంగ్రెస్.. అది కూడా అధికార పార్టీలోని లోపాలను తెలుసుకుని ఫైట్ చేయాల్సిన కాంగ్రెస్ నేతలు .. విపక్షంపై పోరుకు రెడీ అవుతున్నారు.బహుశా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒక విపక్షం.. మరో విపక్షంపై యుద్ధం ప్రకటించిన సందర్భం మనకు కనిపించదు.కానీ, ఘనత వహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సారధ్యంలో దూసుకుపోతున్న ఏపీ నేతలు ఈకొత్త ఫార్ములాతో దూసుకుపోతుండడం గమనార్హం. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వేరు.. జగన్‌రెడ్డి వేరు. కాంగ్రెస్ భావజాలంతో నిరుపేదల గురించి రాజశేఖరరెడ్డి ఆలోచించేవారు. కానీ జగన్ మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఆయన స్వార్థపరుడు. కాంగ్రెస్ నిరుపేదలకు అండగా ఉంటుంది. జగన్ స్వభావం ఇందుకు విరుద్ధం. ఆయన తన కోసమే పోరాటం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లండి. వైసీపీలో ఉన్న బలమైన నేతలంతా కాంగ్రెస్ భావజాలం కలిగినవారే. వారిని తిరిగి మన గూటికి ఆహ్వానించండి. కాంగ్రెస్‌లో వారికున్న స్వేచ్ఛ.. జగన్ పార్టీలో వారి అనుభవాలను బేరీజు వేసుకోమని చెప్పండి.“ అంటూ తాజాగా రాహుల్ ఏపీ నేతలకు హితవు చెప్పారు.ఇకపై.. వైసీపీనే లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడి సాగించాలని నూరిపోశారు. రాజశేఖరరెడ్డి మీద అభిమానంతో జగన్‌రెడ్డిని విడిచిపెట్టొద్దు. రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పీసీసీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే, అసలు విషయానికి వస్తే.. కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది వైసీపీలోకి వెళ్లినా.. గత ఎన్నికల్లోనూ దీనికి ముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ వారు స్వంతగానే గెలుపొందారు తప్ప.. కాంగ్రెస్ అండతో మాత్రం కాదన్నది నిజం.కాంగ్రెస్‌కు అంత బలమే ఉండి ఉంటే.. నంద్యాల ఉప ఎన్నికలోనూ, కాకినాడలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పట్టు ఎందుకు సాధించలేకపోయినట్టు..? అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో శతాబ్దాల చరిత్ర ఉన్న పార్టీని ముందుకు నడిపించే నాథుడే లేకుండా పోయాడు. అసలు ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు నాయకులు ఎవ్వరూ లేరన్న విషయం పక్కన పెట్టేస్తే అసలు కార్యకర్తలు లేని స్థితి నుంచి ఓటర్లు కూడా లేని దుస్థితికి దిగజారింది. సొంత కాళ్లపై ఎదిగేందుకు ప్రయత్నించకుండా ఎదుటివారి బలహీనతలపై ఆధారపడడం అతి పెద్ద జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ కనిపెట్టిన కొత్త స్క్రిప్ట్!! మరి ఏం జరుగుతుందో చూడాలి.