తెలుగుదేశం పార్టీ నేతలపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మండిపడ్డారు. పోలవరానికి బీజేపీ సహకరించడంలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. రూ.1935 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి... కేంద్రానికి ఇంకా నివేదిక అందలేదని ఆమె తెలిపారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనే అని గుర్తుచేశారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. పోలవరం కోసం బీజేపీ చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. సిమెంట్ రోడ్లు, 24 గంటల కరెంట్ కేంద్రం ఇస్తుంటే.. చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపైనా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. స్టీల్ప్లాంట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబే అడిగారని పురందేశ్వరి తెలిపారు. జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీకి ఉందని, దీనిపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదేనని పేర్కొన్నారు.