ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ఆపార్టీ ప్రయత్నాలుచేస్తోంది. ఇందులో భాగంగా మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం కలిశారు. తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నల్లారికిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయాక సమైక్యాంధ్ర పార్టీతో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నల్లారిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావాలన్నది ఆ పార్టీ ప్రయత్నంగా ఉంది. నల్లారి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మరి కాంగ్రెస్ ఆహ్వానానికి నల్లారి ఏం సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.