- ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిన గీతానందన్..
- కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం
కేరళకు చెందిన ఓ ప్రముఖ కళాకారుడు తనకు పేరుప్రఖ్యాతలు సాధించిపెట్టిన నాట్య వేదికపై ప్రదర్శన ఇస్తూనే తనువు చాలించాడు. ఓట్టన్‌తుళ్లల్ నాట్య కళాకారుడైన 58 ఏళ్ల కలమండలం గీతానందన్ కేరళీయులకు సుపరిచితుడు. కళమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ట్ అండ్ కల్చర్‌లో తుల్లల్ విభాగపు మాజీ అధిపతిగానూ గతంలో సేవలందించారు. 2000 సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డు సాధించడంతో పాటు దాదాపు 30 చిత్రాల్లో నటించాడు.
త్రిసూర్ జిల్లా ఇరింజలక్కుడలోని ఓ ఆలయంలో ఓట్టాన్‌తుళ్లల్ ప్రదర్శన ఇస్తుండగా కలమండలం గీతానందన్ కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన కన్నుమూశారు. కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.