YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు స్వీప్ దిశగా బాబు వ్యూహా రచనలు

నెల్లూరు స్వీప్ దిశగా బాబు వ్యూహా రచనలు
ఎట్టకేలకు జిల్లాలో టీడీపీని తిరిగి గాడిలో పెట్టడం ద్వారా 2019 ఎన్నికలకు పార్టీశ్రేణుల్ని సన్నద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు నెల్లూరు జిల్లాను వేదికగా నిర్ణయించుకోవడం వెనుక కారణం ఇదేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈనెల 8వ తేదీన నాయుడుపేటలో నవనిర్మాణ దీక్షలో చివరి అంకమైన మహాసంకల్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి విచ్చేశారు. తిరిగి ఇదే నెల 30వ తేదిన రాష్టస్థ్రాయిలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘దళిత తేజం’ బహిరంగ సభను నెల్లూరు నగరంలో నిర్వహిస్తుండడం, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతుండడం విశేషం. ఇలా గతంలో విజయవాడ మినహాయించి ఏ జిల్లాలోనూ ఒకే నెలలో రెండు రాష్టస్థ్రాయి సదస్సులకు ముఖ్యమంత్రి హాజరైన సందర్భాలు లేవు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీ విజయకేతనం ఎగురవేస్తే కడప, నెల్లూరు జిల్లాల్లో మాత్రం అధికార పార్టీకి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. మొత్తం 10 స్థానాలకు గాను ఏడు స్థానాలతో పాటు నెల్లూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలను కూడా టీడీపీ ప్రతిపక్ష వైకాపాకు కట్టబెట్టాల్సి వచ్చింది. అయితే ఎన్నికల తర్వాత జిల్లాలో చట్టసభల ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి తక్కువగా ఉండటాన్ని గ్రహించి, పార్టీశ్రేణుల్ని కాపాడుకోవడంతో పాటు తిరిగి పార్టీని జిల్లాలో విజయపథాన నిలపాలంటే స్థానిక నేతలకు పదవులు అవసరమని భావించిన ముఖ్యమంత్రి జిల్లాకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మినహాయిస్తే నామినేటెడ్ కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించారు. అందులో ఇద్దరు ఎమ్మెల్సీలయిన పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు మంత్రులుగా ఉండగా, మరో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా జిల్లాకు న్యాయం చేశామని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే ఇదే సందర్భంలో జిల్లాలో పార్టీ పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుకుంటోందనే నిఘా వర్గాల సమాచారంతో ఆయన పార్టీ నేతలపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. పార్టీలోకి వస్తున్న కొందరు ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు జిల్లా నేతలతో పొసగలేక తిరిగి తమ దారి చూసుకుంటున్నారు. తాజాగా పార్టీ నుండి ఆత్మకూరు ఇన్‌చార్జ్ ఆనం రామనారాయణరెడ్డి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఆనంను మంత్రులు, స్థానిక నేతలు నచ్చచెప్పలేకపోవడం కూడా ముఖ్యమంత్రి సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. అలాగే తాను ఎంపీగా పోటీ చేయలేనని, కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడమే తన నిరాసక్తతకు కారణమని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి ఎదుట స్పష్టం చేశారు. ప్రభాకర్‌రెడ్డి లాంటి సమర్ధవంతుడైన అభ్యర్థి ఎంపీ బరి నుండి వైదొలగితే అంతటి సమర్ధత కలిగిన మరో అభ్యర్థిని తీసుకురావడం ప్రస్తుతం టీడీపీకి కష్టతరమనే చెప్పాలి. వైకాపా గాలి వీచిన నెల్లూరు జిల్లాలో కేవలం 13వేల ఓట్ల తేడాతో 2014లో ఆదాల ఓడిపోయారు. ఎమ్మెల్యే ఓట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఇలా జిల్లా టీడీపీలో ఎవరికి వారు తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో వేలుపెడుతూ గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని భావించిన ముఖ్యమంత్రి స్వయానా తానే ఇక రంగంలోకి దిగినట్లు పార్టీశ్రేణులు భావిస్తున్నాయి. సమన్వయ కమిటీ సమావేశాలకు సమయపాలన లేకుండా సభ్యులు వస్తుండడం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టడంతో పాటు ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి గురించి అన్ని వర్గాల ప్రజలకు సవివరంగా తెలియచేస్తూ 2019 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ జెండా ఎగిరేందుకు కార్యకర్తల్ని సన్నద్ధం చేసే పనిలో స్వయాన ముఖ్యమంత్రే రంగంలోకి దిగినట్లు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

Related Posts