ఏపీ టీడీపీలో తోక జాడిస్తున్న నేతల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అధినేత ఎంత చెప్పినా నాయకులు వినిపించుకోవడం లేదు. మరో ఏడాది లోపే రాష్ట్ర అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీని గెలిపించుకుని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి సామాజిక వర్గాన్నీ పార్టీకి చేరువ చేస్తున్నారు. మహిళలను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. ప్రతి ఒక్కరిలోనూ సంతృప్తి స్థాయిలు పెంచేదిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక ఎన్నికల హీట్ స్టార్ట్ అవ్వడంతో పాలనా పరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకపక్క కేంద్రం సహకరించకున్నా.. చంద్రబాబు మాత్రం రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలూ కష్టపడుతున్నారు. మరి పార్టీ పరంగా ఏం జరుగుతోంది. జన్మభూమి కమిటీలు, నియోజకవర్గ ఇంచార్జులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న అధికార పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పుడు వీరంతా బాబు మాటలను పెడచెవిన పెడుతున్నారు. దాదాపు 40% మంది టీడీపీ నాయకగణం.. ఇష్టానుసారంగా తోక ఝాడిస్తోంది.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వివాదాలు.. బాబుకు తలనొప్పిగా పరిణమించాయి. బాబు ముందు తాము కలిసి మెలిసి పనులు చేస్తామని పేర్కొంటున్న నేతలు ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి భూమా అఖిల ప్రియలు.. ఇప్పుడు మళ్లీ యధాప్రకారం మాటల తూటాలు సంధించుకుంటూ.. తాము మారేది లేదని అధినేతకు స్పష్టం చేశారు. అయితే, ఇలాంటి పంచాయితీలు చంద్రబాబుకు ఇదొక్కటే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్లు తగువులాడుకుంటున్నారు. ఇప్పుడు వీరికి తోడు తాజాగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి కూడా తోడయ్యారు. మంత్రి అఖిలప్రియ తీరుపై ఆయన భగ్గుమంటున్నారు.మరో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేతల మథ్య వార్ మరింత పెరిగిపోతోంది. ఇప్పటికే నేతలు తమ తమ వారసులను రంగంలోకి దింపుతుండడం, మరికొన్ని చోట్ల వైసీపీ నుంచి వచ్చిన నేతలు ఉండడంతో వారికి, టీడీపీ సీనియర్లకు పొంతన లేకుండా ఉండడం, నియోజకవర్గాల్లో ఆధిపత్యం, వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఆరాటం ఇలా ఒకటి కాదు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ నేతలు తన్నుకుంటున్నారు. కొన్ని బయట పడుతున్నా.. మరికొన్ని మాత్రం గంపకింద కోడిలా గుంభనంగా ఉన్నాయి. అయితే, ఎన్నికల సమయానికి మాత్రం ఇవి కూడా బయటపడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇలా నివురు గప్పిన నిప్పులా ఉన్న టీడీపీ వివాదాస్పద నియోజకవర్గాలను పరిశీలిస్తే.. దాదాపు 50 వరకు ఉంటాయని తెలుస్తోంది.కడపలో మైదుకూరు, జమ్మలమడుగు, అనంతపురంలో అనంతపురం సిటీ, శింగనమల, పెనుగొండ, ప్రకాశంలో ఒంగోలు నియోజకవర్గం, ముఖ్యంగా కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి రవి, కొండపిలో దామచర్ల వర్సెస్ డీబీవీ స్వామి, విశాఖపట్నంలో అయ్యన్న పాత్రుడు, మంత్రి గంటా, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వర్గ పోరు తారస్ధాయికి చేరుకుంది. ఎన్నిక లు సమీపిస్తున్న కొద్దీ వర్గపోరు ముదిరి రోడ్డున పడుతుండటంతో చంద్రబాబుతో పాటు నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.దాంతో ఆళ్ళగడ్డ పంచాయితీ అన్నది మిగిలిన నియోజవర్గాల్లోని పంచాయితీలకు ఓ పాఠం అని నేతలకే అనుమానాలు మొదలయ్యాయి. ఈ పంచాయియతీలతో నే చంద్రబాబు కాలం గడిచి పోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఇటీవల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. తోకఝాడించే నేతలను వదిలించుకుంటానని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే కరణం లాంటి సీనియర్లను సైతం ఆయన వదులుకుంటానని ఇన్‌డైరెక్టుగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో బాబు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.