అనంతపురంలో పర్యటనకు వస్తున్న భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు ఆయన నగరంలోకి రాకముందే బీజేపీకి ప్రతిఘటన ఎదురైంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీ నేతలను జిల్లాలో అడుగు పెట్టకూడదంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సప్తగిరి సర్కిల్ వద్దకు చేరుకుని వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. పోలీసులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సంఘటనతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు..