2017, నవంబర్ ఆరో తేదీన వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం అయ్యింది. వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగపూరితమైన వాతావరణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అశేషజనవాహిని మధ్యన అలా మొదలైన జగన్ పాదయాత్ర అదే జనసందోహం మధ్యన సాగుతూ నేటితో 200 రోజులను పూర్తి చేసుకుంది. 200వ రోజు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలో జగన్ పాదయాత్ర సాగుతోంది. ఈ సుదీర్ఘయాత్రలో ఇప్పటి వరకూ జగన్ మోహన్ రెడ్డి 92 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని, 158 మండలాల్లో, 1,243 గ్రామాల మీదుగా... 2,430 కిలోమీటర్ల దూరాన్ని నడిచారు. ఇదే సమయంలో 86 సభల్లో ప్రసంగించారు జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ అడుగు తీసి అడుగేస్తుంటే.. అనంతసాగరమల్లే అశేష జనవాహిని కనిపిస్తున్నారు. ఏ సభ పెట్టినా జన ప్రభంజనం పోటెత్తుతుంది. ఈ ఆదరణను జగన్ మోహన్ రెడ్డి ఏ మేరకు ఓటు బ్యాంకుగా మార్చుకుంటారు అనేది ఒక శేష ప్రశ్న. వచ్చే ఎన్నికలతో కానీ ఈ విషయంపై స్పష్టత రాదు. పాదయాత్ర అప్పుడే అయిపోలేదు. మరిన్ని వందల కిలోమీటర్ల దూరం సాగనుంది. దాదాపు మూడు వేల కిలోమీటర్ల సుదూర లక్ష్యంతో జగన్ పాదయాత్ర సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర కూడా అక్కడే ముగిసింది. నాటి సెంటిమెంట్ జగన్‌కు కలిసొస్తుందేమో కాలమే సమాధానం ఇవ్వాలి.