రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. రజనీ రాకతో తమిళ రాజకీయాలు మారిపోతాయని భావిస్తున్న ఆయన అభిమానులకు రజనీకాంత్ ఎప్పటికప్పుడు నిరాశపరుస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తానని గత డిసెంబర్ నెలలోనే రజనీకాంత్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.కాని పార్టీ ప్రకటన మాత్రం రావడం లేదు. రజనీకాంత్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో రజనీ పార్టీ పెట్టేదెప్పుడు? జనం లోకి వెళ్లేదెప్పుడు అన్న అనుమానాలు అభిమానుల్లోనూ కలుగుతున్నాయి.అయితే ఆయన సన్నిహితుడు తమిళరువి మణియన్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంత క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది నవంబరు 18వ తేదీన రజనీకాంత్ పార్టీని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. అదే తేదీని రజనీకాంత్ ముహూర్తంగా నిర్ణయించుకున్నారని చెప్పారు. దీంతో రజనీ అభిమానులు ఆనంద పడుతున్నారు. వాస్తవానికి రజనీకాంత్ పార్టీ ఎప్పుడు పెడతారా? అని ఒక్క తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు ఎదురు చూస్తున్నాయి. రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీ సభ్యత్వం పైనే దృష్టి పెట్టారు. అయితే రజనీకాంత్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు.కాని 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ ఏడాది నవంబర్ నెలలో పార్టీ పెట్టినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జనంలోకి వెళ్లడానికి కొంత సమయం దక్కుతుంది. అయితే ముందస్తు ఎన్నికలు వస్తేనే ఇబ్బంది. ప్రస్తుతం ప్రధాని మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలోనే లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశముంది. అదే జరిగితే రజనీకాంత్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం కొద్ది సమయంలోనే పార్టీని, గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించడం కష్టమవుతుంది. ముందస్తు ఎన్నికలు జరిగితే మాత్రం రజనీకాంత్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరి అలాంటి సమయంలో రజనీ ఎవరికి మద్దతిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది. ఒకవైపు సహచర నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ తో కూడా సమావేశమయ్యారు. మరి రజనీ ఈకూటమితో కలుస్తారా? కొంత బీజేపీ పట్ల అనుకూలంగా వ్యవహరిస్తున్న రజనీ ఆ పార్టీకి మద్దతిస్తారా? అన్నది ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.