YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవ్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోల 200 కోట్ల విరాళం

నవ్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోల 200 కోట్ల విరాళం
ఉద్యోగులకు సుమారు రూ. 4 వేల కోట్ల పీఆర్సీ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్న వేతన సవరణ కమిషన్‌ బకాయిల నుంచి రూ.200 కోట్లు అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఏపీ ఎన్జీఓలు ప్రకటించారు. రూ.3,940 కోట్ల పీఆర్‌సీ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు బుధవారం సచివాలయంలో చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా, నవ్యాంధ్ర నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే మరింతగా శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్దిపథంలో నడపడానికి సాయపడాలని ఆయన కోరారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చే రూ.200 కోట్లతో ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉండే భవన నిర్మాణం చేపట్టాలని పురపాలిక మంత్రి నారాయణకు సూచించారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ.. తాము ఇచ్చిన విరాళంతో ప్రభుత్వం నిర్మించే భవనానికి ముఖ్యమంత్రి పేరు పెట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించిన దాఖలాలు లేవని, సీఎం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఉద్యోగుల మనసు గెలుచుకున్నారని ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుందని హర్షం వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ ప్రయోజనం కలుగుతుందని అన్నారు. 

Related Posts