మత్స్యకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పెంపకం కార్యక్రమం జిల్లాలో విజయవంతం కాలేకపోయింది. చెరువులు, కుంటల్లో సరిపడా నీరు లేకపోవడంతో చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రభుత్వం చేపపిల్లలను మత్స్యసహకార సంఘాలకు ఇస్తున్నప్పటికీ.. చెరువుల్లో నీళ్లు లేక ఎండాకాలంలో ఆక్సిజన్ అందక చాలామటుకు చనిపోతున్నాయి. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తాయనే అంచనాతో 1.12కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈమేరకు టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గతేడాది 258 చెరువుల్లో 65.91 లక్షల చేపపిల్లలను వదిలారు. జిల్లాలోని కథలాపూర్, మల్యాల, కొడిమ్యాల వంటి మండలాల్లోని చెరువుల్లో నీళ్లు లేక చేపలు పెంచలేకపోయారు. అయితే వర్షాలు ఆలస్యమవుతుండడంతో చేపపిల్లలను చెరువుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వేయనున్నారు. ఇలా వేసిన చేపపిల్లల్లో కొన్ని నీళ్లు లేక, మరికొన్ని చెరువుల్లోని చెత్తతో ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో చెరువుల్లో నీరు తగ్గుతుండడం.. ఆ సమయంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎక్కువ మొత్తంలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఉన్న వాటిని సైతం కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారులు నేరుగా అమ్ముకోలేకపోతున్నారు. చెరువులను కాంట్రాక్టర్‌లకు లీజుకు ఇస్తూ అంతంతే ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో 1,227 చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ 611 చెరువులు మాత్రమే గ్రామపంచాయతీ కింద ఉన్నాయి. 175 చెరువులు మత్స్యసహకారశాఖ పరిధిలో ఉన్నాయి. దాదాపు 274 చెరువుల్లో పరిస్థితులు చేపల పెంపకానికి అనువుగా లేవు. ఎంపిక చేసిన చెరువుల్లో మత్స్యశాఖ తరఫున ప్రభుత్వం చేపల పిల్లలను పంపిణీ చేస్తుంది. జిల్లాలో 184 మత్స్యసహకార సంఘాలు ఉండ గా, అందులో 10,187 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 26 మహిళా సంఘాలు ఉండగా 800 మంది సభ్యులు, 158 పురుషుల సంఘాలు ఉం డగా 9,387 మంది సభ్యులు ఉన్నారు.లక్ష్యం భారీగానే జిల్లాలోని చెరువుల్లో వేసిన చేపపిల్లలకుగాను 3,200 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా వేసినప్పటికీ 2,048 మెట్రిక్‌టన్నుల చేపల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఉత్పత్తి తగ్గడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయంటున్నారు అధికారులు. చెరువుల్లో రవు, కట్ల, మృగ, బంగారుతీగలను వదిలారు. 8–9 నెలల్లోనే దాదాపు ముప్పావు కిలో నుంచి కిలో వరకు పెరిగాయి. ప్రస్తుతానికి జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో చేపల మార్కెట్లు ఉండగా, ధర్మపురి, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో చేపల మార్కెట్ల పనులు సాగుతున్నాయి. రాయికల్, జగిత్యాల మండలం మోతె, కొండగట్టు కింద ముత్యంపేట వంటి చోట్ల చేపల మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటికితోడు గోదావరి తీర ప్రాంతం వెంబడి చేపలను విక్రయిస్తున్నారు. కొన్ని ప్రధాన చెరువుల వద్ద కూడా మత్స్యకారులే స్వయంగా చేపల మార్కెట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నప్పటికీ చాలా చోట్ల మత్స్యసహకార సంఘాలు మళ్లీ బడా వ్యక్తులకే లీజుకు ఇస్తున్నాయి. సహకార సంఘం సభ్యులే చేపలను పట్టి లీజుదారులకు కిలోకు కొంత చొప్పున తీసుకొని విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చేపలు పెరిగిన తర్వాత లీజుదారులతో సంఘాలు ఒప్పందం చేసుకుంటున్నాయి. నేరుగా మత్స్యకారులు చెరువుల్లో చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు శిక్షణ సదస్సులు పెట్టి మత్స్యకార సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఉపాధి పొందలేకపోతున్నారు.