విద్యార్థుల్లో విద్యాసామర్థ్యం పెంపొందించుకునేందుకు, ఉపాధ్యాయుల్లో బోధనాభ్యాసన ప్రక్రియ మరింత ఫలవంతంగా, ప్రభావితంగా రూపొందించేందుకు జాతీయ విద్యా పరిశోధనా సంస్థ తొలిసారిగా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎనర్జైజింగ్ టెక్స్ట్ బుక్స్ పేరుతో కేజీ నుంచి ఇంటర్ వరకు నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తోంది.తొలిసారిగా మన రాష్ట్రంలోనే సాంకేతికతను వినియోగించారు. ప్రస్తుతానికి ఆరునుంచి పదో తరగతి సైన్స్, సోషల్ స్టడీస్ పాఠ్యాంశాలకు సంబంధించి కోడ్ ముద్రించారు. తరువాత ఎల్‌కేజీ నుంచి 5వ తరగతికి అమలు చేస్తారు. ప్రస్తుతం ఇంటర్ ప్రధమ సంవత్సరం మాధ్యమాల సిలబస్ మారినందున ఈ పాఠ్యపుస్తకాల్లోనూ ఈ సాంకేతికత రూపొందించే అవకాశం ఉం దని విద్యాశాఖాధికారుల అభిప్రాయం.ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సుమారు 1,58,103 మందికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. తరువాత మిగిలిన ఎల్‌కేజీ 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులు సుమారు 1,60,000 మంది, ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు దాదాపు 60 వేల మంది ఈ సాంకేతికతను వినియోగించుకునే అవకాశం ఉందని అధికార సమాచారం. నూతన విధానం వల్ల విద్యార్థులకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించిందే గాకుండా ప్రయోగాత్మకంగా ప్రాజెక్ట్ మెథడ్‌లో ఒక పాఠ్యాంశాన్ని పలుమార్లు విని అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయుడు చెప్పిన దాని కంటే విద్యార్థి క్షుణ్ణంగా నేర్చుకొని విద్యా సామర్థ్యం పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలలో క్యూ ఆర్ కోడ్స్ ముద్రించింది. ఈ కోడ్ పాఠ్యపుస్తకాలలో ప్రతీ పేజీలో ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీక్షా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను అండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాట్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత యాప్‌ను తెరచి భాషను తెలుగుగా ఎంచుకోవాలి. గెస్ట్ యూజర్‌గా కొనసాగాలి.స్టూడెంట్ పేరు ఎంపిక చేసుకొని కుడి వైపు ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్‌ను నొక్కాలి. తరువాత పాఠ్యపుస్తకంలో ముద్రించిన క్యూఆర్‌కోడ్ స్కాన్ చేయాలి. వెంటనే క్యూఆర్ కోడ్‌లో జత చేసిన విషయాలు కనిపిస్తాయి. కావలసిన విషయాలను వీక్షించేందుకు లింక్‌పై క్లిక్ చేస్తే మొత్తం పాఠం తెరపై ప్రత్యక్షమవుతుంది. దానిని దృశ్య రూపంలోనూ విద్యార్థులు వీక్షించవచ్చు.