YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడపలో గాలికి అవకాశం ఇస్తారా

కడపలో గాలికి అవకాశం ఇస్తారా
కడపలో ఉక్కుపరిశ్రమ కోసం సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా మిన్నకుండిన గాలి హఠాత్తుగా ఉక్కుపరిశ్రమను తానే నిర్మిస్తానని, అవకాశం తనకే ఇవ్వాలని రెండేళ్లలో పూర్తిచేస్తాననంటూ చెప్పారుగాలి జనార్థన్‌రెడ్డిని హఠాత్తుగా తెరముందుకు తెచ్చి బిజెపి తన రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. ఏళ్లతరబడి నోరుమెదపని గాలి జనార్థన్‌రెడ్డి ప్రస్తుతం తనకే పరిశ్రమ నిర్మాణ పనులు అప్పగించాలని చెప్పడం వెనక బిజెపి హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉక్కు ఉద్యమాలు ఉధృతమవుతున్న పరిశ్రమను ప్రకటిస్తే ఇతర పార్టీల జాబితాల్లో చేరుతుందని, గాలి జనార్ధన్‌రెడ్డి ద్వారా నిర్మించడం వల్ల బిజెపి ఖాతాలో జమచేసుకోవచ్చన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపిదీ ఇదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ స్థాపనకు నో చెప్పగానే కొద్ది కాలం దీక్షల పేరుతో ప్రచారం నిర్వహించి ప్రజల సానుభూతిని కొల్లగొట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుసోంది. కేంద్రాన్ని దెబ్బకొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రయివేటు పరిశ్రమను ఏర్పాటు చేసి క్రెడిట్‌ సంపాదించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ప్రజా సొమ్ము మళ్లీ ఎక్కడగాలి పాలు అవుతుందోనన్న ఆందోళన ప్రజలను వేధిస్తోంది. బిజెపితోనూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అప్పట్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ స్థాపనకు అనుమతిని పొందాడు. ఈ మేరకు ప్రభుత్వం ఎకరా రూ. 18,500 చొప్పున దాదాపు 10760 ఎకరాలను బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌కు అప్పగించింది. బ్రాహ్మిణికి ముడి ఖనిజం సరఫరా కోసం ఓబులాపురంలో కేటాయించిన గనుల నుంచి అక్రమంగా ఖనిజాన్ని తరలించారన్న కేసులో 2009లో గనులను సీజ్‌ చేయడంతో పాటు గాలిజనార్ధన్‌రెడ్డితోపాటు పలువురు ఐఎఎఎస్‌ అధికారులు సైతం జైలు పాలయ్యారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టి తిరిగి అదే పరిశ్రమను నిర్మిస్తానని ముందుకు రావడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం అటు పరిశ్రమ స్థాపన లేక ఇటు ఉద్యోగం రాక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.ఓబులాపురంలో ముడిఖనిజాన్ని సరఫరా చేయడానికి ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ పేరుతో ప్రభుత్వం దాదాపు 335 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వంద మిలియన్‌ టన్నుల ఖనిజాన్ని తీయాలనే అంచనాలతో ప్రభుత్వం అప్పగించింది. గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఖనిజాన్ని తరలించారని తెలియడంతో సిబిఐ దాడులు చేసి కేసులను నమోదు చేసింది. ఈ మేరకు కడప జిల్లా మైనింగ్‌శాఖ విభాగం నుంచి మాత్రమే దాదాపు 52 లక్షల పర్మిట్లను జిల్లాలో తవ్వుకోవడానికి మైనింగ్‌ యజమానులు అనుమతిని తీసుకున్నారు. యజమానులు గాలి జనార్థన్‌రెడ్డితో ఒప్పందాలు చేసుకుని అక్రమంగా పర్మిట్లను అమ్ముకున్నారు. ఇక్కడి పర్మిట్లను వినియోగించి ఓబులాపురం గనులకు వినియోగించుకున్నట్లు సమాచారం. ఒక పర్మిట్‌కు కనీసం 10 నుంచి 15 టన్నులు తవ్వుకునే అవకాశం ఉంటుంది. దీని మేరకు దాదాపు 5.20 కోట్ల టన్నులకుపైనే అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం జిల్లా పరిధిలో మాత్రమే దాదాపు రూ. 500 కోట్లకు పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. కేవలం కడపలోనే ఇంత వ్యవహారం నడిస్తే మొత్తంగా చూస్తే ఎంత అవినీతి జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు బ్రాహ్మణీకోసం కేటాయించిన భూములను సూరిటీగా వినియోగించి ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున బ్యాంకుల్లో రుణం పొందినట్లు సమాచారం.

Related Posts