ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో చక్కర్లు కొట్టడమే సరిపోతోందనేది ప్రతిపక్షాలు తరచూ చేసే విమర్శ. ఆయన ఈ మధ్య విదేశీ టూర్లు కొంత తగ్గించారు గానీ ప్రధానిగా ఎన్నికైన మొదటి రెండేళ్లు ప్రపంచం మొత్తం తిరిగారు. ఒక ప్రధానమంత్రిగా ఆయన విదేశాలకు వెళ్లడం, దేశ విదేశీ వ్యవహారాలకు చాలా అవసరం. అన్ని దేశాలతో సత్సంబంధాలు మెరుగుపర్చడంలో ఆయన పర్యటనలు కొంతవరకు కచ్చితంగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అయితే, మోదీ విదేశీ టూర్ల గురించి బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐలో దరఖాస్తు చేయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి.ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో పర్యటించారు. 41 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. అంటే ఒక్కో పర్యటనలో కొన్నిసార్లు రెండుమూడు దేశాలు కూడా వెళ్లివచ్చారు. ఆయన నాలుగేళ్ల పదవీ కాలంలో 165 రోజులు విదేశీ పర్యటనల్లో గడిపినట్లు విల్లడైంది. 30 పర్యటనల వివరాలను దరఖాస్తుదారునికి ఇవ్వగా ఈ పర్యటనలకు గానూ మొత్తం రూ.355 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా పర్యటనలకే రూ.31.25 కోట్లు ఖర్చు కాగా, అతితక్కువగా భూటాన్ పర్యటనకు రూ.2.45 కోట్లు మాత్రమే ఖర్చయింది.