YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ సగానికి సీట్లు లెక్కలు తేల్చేశారు

జగన్ సగానికి సీట్లు లెక్కలు తేల్చేశారు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే…సిద్ధమంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం అప్పుడే అభ్యర్దుల జాబితా సిద్ధమయిందంటున్నారు. ఇప్పటికే దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్ ఖారారు చేశారని వార్తలు వైసీపీలో హల్ చల్ చేస్తున్నాయి. జగన్ రెండు రోజులు పాదయాత్రకు విరామం ప్రకటించి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహంతో వెళ్లాలన్నదానిపై ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన నేతలకు సూచించినట్లు సమాచారం.వైఎస్సార్ కాంగ్రెస్ ముందు నుంచి 2019 ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఒకవైపు ప్రజల్లోకి వెళ్లడంతో పాటు మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంది. అయితే వైసీపీ ఇప్పటి వరకూ ఐదు సంస్థలతో అంతర్గత సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ మరో ఐదు సంస్థలతో సర్వేలు నిర్వహించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేల ద్వారా దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను జగన్ దాదాపు ఖరారు చేసినట్లు చెబుతున్నారు.మరో 95 నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం సర్వేలు ఇంకా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, వారిలో ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్న వారికే సీట్లు దక్కే అవకాశం ఉందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. జగన్ ఖారారు చేసిన 80 స్థానాలు ఆయన పాదయాత్ర పూర్తి చేసిన జిల్లాల్లోనే ఉన్నాయంటున్నారు. జగన్ ఇప్పటివరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ జిల్లాలకు సంబంధించి 80 మంది అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారయినట్లేనన్నది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.ఇక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని వైసీపీ దాదాపుగా నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం ముందస్తు జరిగే అవకాశముండటంతో ఎన్నికలకు సిద్ధమయిపోయారు జగన్. పాదయాత్ర పూర్తయ్యేందుకు ఇంకా మూడు నెలల సమయం తీసుకునే అవకాశముంది. సెప్టెంబరు చివరినాటికి గాని జగన్ పాదయాత్ర శ్రీకాకుళం చేరుకోలేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. ఈలోపుగానే అభ్యర్థులను ఖారారు చేసి నియోజకవర్గాల్లో వారిని ప్రజలకు వద్దకు పంపాలన్నది పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీం అందించిన సమాచారం ప్రకారం 20 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని నివేదిక ఇవ్వడంతో దానిపై జగన్ దృష్టి పెట్టారు. ఆ 20నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో జగన్ విడివిడిగా సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ ముందస్తు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నారు.

Related Posts