YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముందస్తు ఊహాగానాలతో అప్రమత్తం

ముందస్తు ఊహాగానాలతో అప్రమత్తం
ముందస్తు ఎన్నికలు వచ్చే డిసెంబరులో జరగవచ్చన్న ప్రచారంతో రాజకీయ పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. పైగా జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు తెలియడంతో ముందస్తు ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సెంటిమెంట్ జిల్లాగా పేరొందిన తూర్పుగోదావరిలో ఈ ముందస్తు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రథాన రాజకీయ పార్టీల అధినేతలందరూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసే దిశగా సాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర సాగుతోంది. ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తున్న జగన్ పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. తెలుగుదేశం నుండి ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో జగన్ మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్‌గా పనిచేసిన జిల్లాకు చెందిన శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం సహా జిల్లాకు చెందిన ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యే, ఇరువులు మాజీ ఎమ్మెల్యేలతో వైసీపీ వైపు చూస్తుండటంతో వారితో జగన్ నేరుగా సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉండగానే పిరాయింపులకు సిద్ధమైన నేతలతో జగన్ మంతనాలు సాగించే అవకాశం ఉంటుందని సమాచారం! అయితే సదరు ఫిరాయింపుదార్లు టిక్కెట్లు కేటాయిస్తామన్న హామీనిస్తే పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమని ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపినట్టు భోగట్టా! తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లూ టీడీపీ వశమయ్యాయి. తూర్పుగోదావరిలో 19 అసెంబ్లీ స్థానాలకు గాను 5 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అనంతరం జరిగిన పరిణామాలతో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని, ఈ విషయంలో ఏ విధమైన తప్పటడుగు వేసినా మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. అధికార టీడీపీ నేతలూ ముందస్తు ఎన్నికల పట్ల అప్రమత్తమయ్యారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ చెలిమి బెడిసికొట్టిన దగ్గర్నుండీ మారిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, అనుకున్నట్టే ముందస్తుగా ఎన్నికలు నిర్వహిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ధర్మ పోరాట దీక్షలు చేస్తున్న చంద్రబాబు ఈ నెల 29న తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నిర్వహిస్తున్నారు. ఆ దీక్షకు చంద్రబాబు హాజరై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టేందుకు సమాయత్తమవుతున్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాకపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల చంద్రబాబుపై ధ్వజమెత్తిన పవన్ తాజాగా చంద్రబాబుతో కలిసి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇరువురూ పలుకరించుకున్నారన్న ప్రచారంతో రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగుతోంది. ప్రస్తుతం విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ త్వరలోనే తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలకు గల అవకాశాలపై బీజేపీ, కాంగ్రెస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది

Related Posts