తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తుంది. మారుమూల గ్రామాల్లో సైతం కార్పోరేట్ విద్యను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్క చిన్నారికి ఉచితంగా చదువును అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, డ్రెస్సులు, రవాణా భత్యం, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్నం భోజనం వసతి, వారానికి మూడు రోజులు కోడిగుడ్లు ను పంపిణీ చేస్తున్నారు. ఇంగ్లిషు మీడియంలో పాఠశాలలతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వాలంటీర్లను నియమించడం, విద్యార్థులకు క్రీడలు, ఇతర రంగాల్లో ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. జిల్లాలో 1172 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిల్లో 72,776 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 954 ప్రాథమిక పాఠశాలలో 45,181 మంది, 116 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 17,337 మంది విద్యార్థులు, 102 ఉన్నత పాఠశాలల్లో 10,258 మంది విద్యార్థులున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌తో పాటు మారుమూల మండలమైన సిరికొండలో సైతం ప్రైవేటు పాఠశాలున్నాయి. ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులను ఎదో రకంగా మభ్యపెట్టి చిన్నారులను తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. వివిధ ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు, ఇతర ఖర్చుల పేరిట వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు సైతం ఖర్చుకు వెనకాడటం లేదు. అప్పులు చేసి పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా నాలుగేళ్లలో సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. విద్యార్థులకు పుస్తకాలు, డ్రెస్సులు, రవాణా భత్యం, కార్పోరేట్ స్థాయిని తలపించే పాఠశాలల గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సువిశాలమై ఆట స్థలాలున్నాయి. విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్నాం భోజనం వసతి, వారానికి మూడు రోజులు కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నారు. ఇంగ్లిషు మీడియంలో పాఠశాలలతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమించడం, విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యాక్రమాల శిక్షణ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 38 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యమంలో విద్యార్థులకు చదువు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు గుడ్‌బై చెప్పి ప్రభుత్వ పాఠశాల్లో చేరుతున్నారు. గతంలో విద్యార్థులు లేక వెలవెలబోయిన సర్కారు బడులు ఇప్పుడు విద్యార్థులతో సందడిగా మారాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రోఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 6194 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రైవేటు పాఠశాల నుంచి సర్కారు బడిలో చేరిన విద్యార్థుల సంఖ్యను సేకరిస్తున్నామని దాదాపు 3వేల మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి గానూ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 4,73,000 పాఠ్యాపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. వీటితో పాటు పాఠశాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణాభత్యం నెలకు రూ.250 చొప్పున మంజూరు చేస్తున్నారు. వీటితో పాటు విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడంతో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు కార్పోరేట్ స్కూళ్లకు ధీటూగా చదువులు చెబుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు