శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరము ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జులై 16 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జులై 16, 17, 18వ తేదీలలో ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్ సేవ జరుగుతుంది.
జూలై 16వ తేదీ సోమవారం రాత్రి 7.00 గంటల నుండి 8.00 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. జూలై 17వ తేదీ మంగళవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. జూలై 18వ తేదీ బుధవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
జులై 19న పార్వేట ఉత్సవం :
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జులై 19వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.