- మేడారం జాతర రేపటి నుంచి ఫిబ్రవరి 2 వరకు
- వరంగల్‌లో అధికారులతో ఎండీ సమీక్ష
ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నది. 50 కేంద్రాల నుంచి 4200కుపైగా ప్రత్యేక బస్సులను నడుపనున్నది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 2 వరకు జరుగనున్నది. ఈ నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. రెండేండ్ల కిందట జాతర సందర్భంగా 3700 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. సుమారు 8 లక్షల మందికిపైగా భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి జాతరకు మరో 500 బస్సులను పెంచింది. ఈ సారి సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆంచనా. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి తదితర 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నార. జాతరకు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని మేడారం స్పెషల్ ఆపరేషన్స్ విధుల్లో నియమించారు. జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా బస్సులు ఏర్పాట్లుచేయడంతో పాటు, మేడారం వద్ద ఆర్టీసీ తాత్కాలిక బస్ టర్మినల్ ఏర్పాటుచేసింది. అక్కడ వసతులను ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు.
వరంగల్‌లో అధికారులతో ఎండీ సమీక్ష
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కలిసి ఆర్టీసీ ఎండీ రమణారావు సోమవారం వరంగల్‌కు వెళ్లారు. రేపటి నుంచి జాతర ప్రారంభమవుతున్నందున బస్సుల ఆపరేషన్స్, ప్రయాణికులకు ఏర్పాట్లు, మేడారంలో బస్ టర్మినల్, భక్తుల డిమాండ్ మేరకు ఆయా రూట్లలో బస్సుల నిర్వహణపై ఆర్‌ఎంలు, డిపో మేనేజర్లు,అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.