YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

అద్భుతాల లోయ భైరవకోన

అద్భుతాల లోయ భైరవకోన

 

కొత్త సంవత్సరంలో సరదాగా కొత్త ప్రదేశాలు దర్శిస్తే బాగుంటుంది కదా. అయినా, మనం పరిశీలించి చూడాలేగానీ మన చుట్టూనే అద్భుత విశేషాలుంటాయి. అలాంటివి చూసినప్పుడు మనకింత సమీపంలో ఇంత అద్భుతాలున్నాయా!! ఇన్నాళ్ళూ మనము వీటిని పట్టించుకోకుండా ఎంత అశ్రధ్ధ చేశాం!? అని మనమీద మనకే కోపం వస్తుంది. ఓసోస్ అలాంటి విశేషాలు మనదగ్గరకూడా వున్నాయా అనకండి. వున్నదే మనదగ్గర. నేను చెప్పేది చదివితే ఆశ్చర్యపోవటమేకాదు.. చూసిరావటానికి రెడీ అయిపోతారు. మరి చదవండి.

ప్రకాశం జిల్లా..అదేనండీ..మన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకాశం జిల్లానే…అందులో సి.యస్. పురం మండలం..సి.యస్.పురం అంటే పూర్తిపేరు చంద్రశేఖర పురం. ఆ మండలంలోవున్నది అంబవరం కొత్తపల్లి అనేవూరు. ఆ వూళ్ళోనే వున్నది అందాలకి ఆటపట్టు, అద్భుతాలకు నెలవైన లోయ భైరవకోన. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులలో వున్నదీ ప్రదేశం.

ప్రకాశంజిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలుకు 120 కి.మీ.ల దూరంలో వున్నది అంబవరం కొత్తపల్లి. అంబవరం కొత్తపల్లి మరియు సి.యస్. పురం దాకా బస్సులున్నాయి. అక్కడనుండీ ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవాలి. సమయాభావంవున్నవారు ముందునుంచి వారు ఏర్పాటుచేసుకున్న వాహనాలలో వెళ్ళివస్తే మంచిది. ఈ ప్రాంతమంతా నల్లమల అడవులు వ్యాపించి వున్నాయి. అడవుల అద్బుత సౌందర్యమేకాదు..7, 8 శతాబ్దాలలో పల్లవ రాజుల సమయంలో నిర్మింపబడిన అందాల ఆలయాలుకూడా చూపరుల మనసులు దోచుకుంటాయి. ఇవేకాకుండా ఇక్కడవున్న మిగతా విశేషాలేమిటంటే ….

ఈ కోనలో కారుదిగగానే కనిపించేది పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం. ఆయన పక్కనుంచే వున్న దోవలో లోపలకి వెళ్తే 200 మీటర్ల ఎత్తునుంచి దూకే జలపాతం. జలపాతంలో నీరు వున్నా వేసవికాలంలో నీరు అతి తక్కువగా వుంటుంది. కొండలమీదనుంచి కారే ఆ అతి తక్కువ నీరు కిందనిర్మింపబడ్డ పెద్ద సిమెంటు టబ్ లలో చేరుతాయి.

వచ్చినవారందరూ అక్కడ స్నానం చేస్తున్నారు. ఈ జల ప్రవాహం తను పయనించే దోవలో వున్న వివిధ వైద్య మూలికలను ఒరుసుకుని ప్రవహించటంతో ఆ నీటిలో స్నానం చేసినవారికి అనేక రుగ్మతలనుంచి విముక్తి లభిస్తుందిని ఇక్కడివారి నమ్మకం. అందుకే నీరు ఎంత తక్కువ వున్నా వచ్చినవారిలో చాలామంది స్నానం చేస్తుంటారు.

✨ ఇక్కడి ఇంకొకవిశేషం 

నిత్యాన్నదానం. జలపాతం దగ్గరకెళ్ళే దోవలోనే కుడివైపు నిత్యాన్నదానశాల వుంది. ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి వచ్చినవారందరికీ భోజనం పెడతారు. ఈ దోవలోనే ఎడమవైపు దేవస్ధానం వారివే రెండు కాటేజ్ లు వున్నాయి. మరీ అవసరమైతే అక్కడ వుండవచ్చు. ఆ మొదట్లోనే టీ షాపు వున్నది. ఇవి తప్పితే ఈ ప్రాంతంలో ఇంకేమీ దొరకవు. రాత్రిళ్ళు మనుష్య సంచారం తక్కువ వున్నా ఏమీ భయంలేదని టీ కొట్టువాళ్ళు చెప్పారు. వాళ్ళు 15 సంవత్సరాలనుంచీ అక్కడే వుంటున్నారుట.
అడవులూ, జలపాతమేకాదు సుమండీ..వాటిని మించిన సుందర దృశ్యమాలికి కావాలంటే మీరు కారాపినచోటికి రండి. అక్కడ ఎదురుగా ఒక వంతెన, కొంచెం ఎడమవైపు వెళ్తే ఇంకో వంతెన వస్తుంది. వీటిలో దేనిమీదయినా బయల్దేరండి. మీరే ఊపిరి బిగబట్టి మరీ చూస్తారాసుందర దృశ్యాలను.

ఒకే కొండరాతిలో చెక్కిన తొమ్మిది గుహాలయాలు. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక లింగ. గుహలంటే మరీ లోతుగా వుండవు. మనం లోపలకు వెళ్ళక్కరలేకుండానే దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆ గుహాలయాల వెలుపల అందమైన శిలా మూర్తులు. భారత దేశంలో ఎక్కడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే చోట పూజించే ఆలయాలు వున్నట్లు లేదు. కానీ ఇక్కడ మాత్రం, త్రిమూర్తులు ఒకే చోట కొలువైవున్నారు. శివునికోసం చెక్కిన ఈ గుహాలయాలలో శివుడు మధ్యన గర్భగుడిలో లింగరూపుడై పూజలందుకుంటుంటే, ఆలయ ప్రవేశ గోడమీద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు చెక్కి వున్నాయి. ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి (పూజారిగారు చెప్పారు..ముందు మేము కుబేరుడనుకున్నాము), విగ్రహాలుంటాయి. ఈ ఆలయాలన్నీ ఒకే శిల్పి చేత చెక్కబడటం విశేషం.


ఈ శివాలయాలన్నీ పై వరసలో వుంటే కింద ఆలయంలో త్రిముఖ దుర్గ, ముందు శివలింగం పూజలందుకుంటున్నాయి. ఈ దుర్గ కుడివైపు ముఖం మహాకాళి..నోట్లోంచి జ్వాల వస్తూ వుంటుంది. మధ్యన మహలక్ష్మి, ప్రసన్నవదన. ఎడమవైపు మహా సరస్వతీదేవి. ఎక్కడా లేనట్లు ఇక్కడ సరస్వతీదేవి అద్దం చూసుకుంటూ వుంటుంది. కారణం అడిగితే పూజారిగారు తన భీకరమైన స్వరూపం భక్తులు చూస్తే తట్టుకోలేరని అలా అద్దంద్వారా చూస్తే కొంత తీవ్రత తగ్గుతుందని చెప్పారు. నా కోతి బుధ్ధి అంగీకరించలేదు. నాకు తెలిసి సరస్వతీదేవి సౌందర్యవతి, జ్ఞాన ప్రదాత.. తను ఉగ్ర రూపిణి కాదు అంటే…అయితే ఆవిడ తన అలంకరణ చూసుకుంటోంది అనుకోండి అన్నారు.
ఇక్కడ నన్ను అమితంగా బాధించినదేమిటంటే..ఆ ఆలయాలు నిర్మింపబడి ఇన్ని వందల సంవత్సరాలయినాయి. ఇదివరకు రోజులసంగతి మనకి తెలియదు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు, సాధనాలు అందుబాటులో వున్నాయి. చదువు, తెలివిగల ప్రజలు, ప్రభుత్వమూ వుంది. వీరెవ్వరూ వీటిని గురించి ఎందుకు పట్టించుకోవటంలేదు.?? కనీసం ఇలాంటి కొన్ని ప్రదేశాల చరిత్రలన్నా పరిశోధించి ప్రజలకందజేస్తే, మన గత వైభవం అందరికీ పరిచయంచేసిన వారవుతారుకదా. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఇలాంటి అపురూప నిర్మాణాల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి ఎవరికి తోచిన కధలు వారు చెప్పుకోవలసినదేనా!!?? ఇదే ఏ విదేశాలలోనన్నావుంటే ఎంత శ్రధ్ధ తీసుకునేవారోకదా అని.

✨ పూజారిగారు చెప్పిన ఇంకొన్ని విశేషాలు 

ఈ ప్రాంతంలో కోటి ఒక్క శివలింగాలు, 101 కొలనులు వున్నాయి.

అమ్మవారి ఆలయానికి ఎదురుగా చిన్న కోనేరు మూసి వున్నది .. హైదరాబాదులో ఇళ్ళల్లో వుండే నీటి సంపుల్లా.

కార్తీక పౌర్ణమినాడు చంద్రకిరణాలు ఆ నీటిలోపడి (ఆ రోజు మూత తీస్తారు) ఆ రిఫ్లెక్షన్ అమ్మవారిమీద పడుతుందిట. ఆ అద్భుతం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారుట.
పక్కన ఒక గుహలో సొరంగ మార్గం వున్నది. అది హనుమనగిరిదాకా వెళ్తుంది. ఆ ఆలయాలన్నీ చెక్కిన శిల్పి సమాధి అక్కడవుంది.
ఒక కొండమీదకి మెట్లు వున్నాయి. పైన ఏమున్నదంటే దుర్గాలయం అన్నారు. అలసిపోయుండటంతో ఎక్కలేదు. ఇంకో చిన్న కొండమీదకి మెట్లు..లక్ష్మీ, అన్నపూర్ణాలయాలనే బోర్డు కనబడింది. పైకి వెళ్తే చిన్ని గుహ, మనిషి కూర్చుని వెళ్ళాలి లోపలికి.. లోపల 2, 3 కూర్చోవచ్చు. లోపల లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి చిన్న విగ్రహాలున్నాయి. అక్కడ పూజారిగారు శ్రీ కాశీరెడ్డి నాయనగారి శిష్యులు. ఆయన ఈ ప్రాంతం గురించి చెప్పిన విశేషాలు.

????????????????????

పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పాలించేవాడుకనుక భైరవకోన అనే పేరు వచ్చిందని కొందరంటారు. పూర్వం మునులు ఇక్కడ భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేశారుకనుక భైరవకోన అనే పేరని ఇంకొందరంటారు. ఏది ఏమైనా, ఈ కోన క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనకో చిన్న ఆలయం వున్నది త్రిముఖ దుర్గాలయానికి ఎదురుగా గట్టుమీద.

పూర్వం ఈ ప్రాంతాన్ని అభివృధ్ధిపరచినవారిలో శ్రీ అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత అనే ఆయన ముఖ్యులు. ఈయన విగ్రహం ఇక్కడ వున్నది. ఇక్కడ అన్నపూర్ణేశ్వరీమాత కొలువైవుండటానికికూడా ఆయనే కారణం. ఆయన శివ భక్తుడు. శివుడు స్వప్న దర్శనమిచ్చి నిన్ను కరుణిస్తానన్నాడట. కానీ ఎన్నాళ్ళకూ కనికరించలేదుట. అప్పుడాయన అమ్మతో మొరబెట్టుకున్నాడుట. అమ్మ ఆయన ఆర్తి గమనించి అన్నపూర్ణేశ్వరీ రూపాన కనిపించినదట. మరి నిన్ను నేను కరుణిస్తే నాకేమిస్తావని భక్తుడికి పరీక్షపెట్టినదట. అప్పుడా భక్తుడు నాదగ్గరకొచ్చినవాళ్ళకి నేను మంచి చెయ్యాలి. అలా నాకు వరమివ్వు. నేను బతికున్నంతకాలం నీకు ఏదోవిధంగా నైవేద్యం పెడతానని చెప్పాడుట. ఆయన పరోపకార తత్వాన్ని గ్రహించిన జగజ్జనని ఆయన్ని అనుగ్రహించటమేగాక అన్నపూర్ణాదేవిగా అక్కడే స్ధిరపడ్డది.
కాలచక్ర భ్రమణంలో కొంతకాలం మరుగునబడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది. 1949లో శ్రీ కాశీరెడ్డినాయన ద్వారా అందరికీ తెలిసింది. అద్భుతమైన పర్యాటకప్రాంతంగా అభివృధ్ధి చెయ్యటానికి అన్నివిధాలా తగిన ప్రదేశం ఇది. ఇలాంటి అద్భుత క్షేత్రాలను పర్యాటక స్ధలాలుగా అభివృధ్ధిపరచి, పరిశోధనలు జరిపించి వాటి చరిత్ర ప్రజలకందజేస్తే ఈ కళలకాణాచిలు మన వైభవాన్ని వేనోళ్ళ చాటుతూ ఎల్లకాలమూ నిలచివుంటాయికదా!!??

Related Posts