YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ యాత్రతో గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఊపు

జగన్ యాత్రతో  గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఊపు
జగన్ పాదయాత్ర చేసిన జిల్లాల్లో పార్టీకి కొంత ఊపు కన్పిస్తున్నట్లుంది. జగన్ పాదయాత్ర ఫలితాలు ఒక్కొక్కటిగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా లో ఆ ప్రభావం కొంత కన్పిస్తుందనే చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ అధినేత జగన్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఒకరకంగా తెలుగుదేశం పార్టీకి షాక్ అనే చెప్పాలి. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ ఎర్రా నారాయణ స్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. అన్ని స్థానాలనూ తెలుగుదేశం అప్పట్లో దాని మిత్రపక్షమైన బీజేపీలు గెలుచుకున్నాయి. వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో తొలి నుంచి జగన్ పశ్చిమ గోదావరి జిల్లాపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా యువభేరి వంటి కార్యక్రమాలతో పాటు వివిధ సమస్యలపై ఆయన జిల్లాకు వచ్చి ప్రజల పక్షాన నిలిచారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు మంచి స్పందనే కన్పించింది. దీనికి తోడు చేరికలు కూడా పార్టీకి మంచి ఊపు నిస్తున్నాయని చెబుతున్నారు.ఎర్రా నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీలో సీనియర్. ఆయన కుమారుడు నవీన్ ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎర్రా నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించారు. ఆయన అన్న కూతురు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి. ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. సీతారామలక్ష్మి రాజ్యసభ పదవీకాలం 2020 తో ముగుస్తుంది. దీంతో సీతారామ లక్ష్మి తన కుమారుడు జగదీష్ కు భీమవరం సీటు కావాలని ఎప్పటి నుంచో అధిష్టానాన్ని కోరుతుంది.అయితే నిన్న మొన్నటి వరకూ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న ఎర్రా నారాయణ స్వామి కుమారుడు నవీన్ పదవీ కాలం ఈ మధ్యనే పూర్తయింది. ఆయన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఆశించారు. కాని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆ పదవిని కొత్త పల్లి సుబ్బారాయుడికి ఇచ్చారు. దీంతో ఎర్రానారాయణస్వామి తమ కుమారుడికి తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అందుకు టీడీపీ సుముఖంగా లేదు. ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇవ్వడం కష్టమని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో ఎర్రానారాయణస్వామి కుమారుడు నవీన్ ఫ్యాన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో ఉండి నియోజకవర్గ వైసీపీ నేత సర్రాజు  మంతనాలు జరిపారు. ఆయనకు గట్టి హామీ లభించడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర ప్రభావం క్రమంగా కన్పిస్తుందంటున్నారు. చేరికలతో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పుంజుకునే అవకాశం స్పష్టంగా కన్పిస్తుందంటున్నారు.

Related Posts