YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముణ్ణాళ్ల ముచ్చటగా కర్ణాటక,జేడీఎస్

ముణ్ణాళ్ల ముచ్చటగా కర్ణాటక,జేడీఎస్
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల కూడా గడవక ముందే కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య స్నేహం చెడిపోయే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన హెచ్చరికలు కూడా స్థానిక నాయకత్వంపై ప్రభావంచూపడం లేదు. మరోవైపు అసమ్మతి నేతలు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. సిద్ధరామయ్య షరా మామూలుగానే తన సత్తాఏంటో చూపించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎంబీ పాటిల్ వచ్చే నెల 15వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. 15వ తేదీలోగా మంత్రివర్గ విస్తరణ లేకుంటే తానేంటో చూపిస్తానని చెప్పడం ఇప్పుడు కలవరపరుస్తోంది.మరో మూడు రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జూన్ రెండున సమావేశాలు ప్రారంభమైతే 5వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. దాదాపు పన్నెండు రోజుల పాటు ప్రకృతి వైద్య చికిత్స చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగుళూరుకు చేరుకోవడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. ఇప్పటికే సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్న సిద్ధరామయ్య అసెంబ్లీ సమావేశాల్లో ఏం చేయనున్నారన్న చర్చ నడుస్తోంది. కుమారస్వామి కేవలం ఒక ఏడాది మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని మిగిలిన పదవీకాలం కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటారని సిద్ధూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. శత్రువుగా భావించే సిద్ధరామయ్యను కట్టడి చేయడానికి దేవెగౌడ ప్రయత్నాలు ప్రారంభించారు. కుమారుడు కుమారస్వామి పాలన సజావుగా సాగేందుకు ఆయన ఢిల్లీలో వ్యూహాలు పన్నుతున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ కు ఝలక్ ఇస్తానంటూ పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఢిల్లీలో ఉన్న దేవెగౌడ ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత ఆప్తుడైన కమలంపార్టీకి చెందిన లెహర్ సింగ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అవసరమైతే బీజేపీతో వెళ్లేందుకు కూడా తాను వెనకాడబోనని దేవెగౌడ సంకేతాలతో కాంగ్రెస్ దెబ్బకు దిగొచ్చింది.సిద్ధరామయ్యను మౌనంగా ఉండాలని ఆదేశించినట్లు సమచారం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ కలసి ప్రయాణంచేయాల్సిన అవసరం ఉందని, ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సిద్ధరామయ్యకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్య మౌనంగా ఉన్నా మరో అసమ్మతి నేత ఎంబీ పాటిల్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై ఆయన మండిపడుతున్నారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదన్న పరమేశ్వర వ్యాఖ్యలను ఆయన సీరియస్ గా తీసుకుని అధిష్టానానికి గడువు విధించారు. వచ్చే నెల 15వ తేదీ వరకూ గడువు ఇస్తున్నానని, ఆ తర్వాత తానేంటో చూపుతానని ఆయన అన్నారు. ఎంబీ పాటిల్ ను బుజ్జగించేందుకు న్యాయశాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తం మీద కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి.

Related Posts