లగడపాటి రాజగోపాల్.. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఆయన రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. చెప్పిన మాట మేరకు ఆయన గత ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే తిరిగి ఆయన రాజకీయ పునరాగమనం చేస్తారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రాజగోపాల్ రెడీ అయిపోయారన్న టాక్ అమరావతిలో బలంగా విన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలన్నది రాజగోపాల్ ఉద్దేశ్యంగా ఉందని చెబుతున్నారు. రాజగోపాల్ పార్టీలో చేరితో వెంటనే కండువా కప్పేయడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉంది.లగడపాటి రాజగోపాల్ బెజవాడ రాజకీయాలను దశాబ్దకాలం శాసించారు. రెండుసార్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. చంద్రబాబును కలసిన ప్రతిసారీ లగడపాటి రాజగోపాల్ తాను వ్యక్తిగత పనుల మీద వచ్చానని చెబుతూ వచ్చారు. కాని ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావాలని గట్టిగానే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సర్వేలు చేయించి పార్టీ పరిస్థితి మీద చంద్రబాబుకు నివేదికలు ఇచ్చారని కూడా చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఇప్పటికే అక్కడ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉండటంతో టీడీపీ అధిష్టానం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఇప్పుడు పార్టీకి హైప్ అవసరం. లగడపాటి లాంటి సీనియర్ నేతలను తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఆయన విభజన జరగకుండా పెద్దయెత్తున పోరాడారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టి జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కారు. విభజన జరగడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఇటీవల తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రానున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. విజయవాడలో ఇటీవల ఫ్లెక్సీలను కూడా కట్టారు.టీడీపీ అధిష్టానం లగడపాటిని నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. నూజివీడులో తెలుగుదేశం పార్టీ బాగా వీక్ గా ఉంది. అక్కడ టీడీపీ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని కలుపుకుని పోలేకపోవడంతో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అక్కడ వైసీపీ కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో లగడపాటిని నూజివీడు నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. నూజివీడులో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలను కలుపుకుని పోయి లగడపాటి విజయం సాధించగలరన్న టీడీపీ భావిస్తోంది. లగడపాటి ఇక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని బెజవాడలో జోరుగా చర్చ జరుగుతోంది. మరి లగడపాటి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నారో…చూడాలి.