పళనిస్వామి పెద్ద పరీక్షే ఎదురుకానుంది. జయలలిత లాగా ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి లేదు. ఏదో తన పనితాను చేసుకు పోతున్నారు. ఎవరినీ నొప్పించకుండా పాలనను సజావుగానే సాగిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని ఆందోళన చెందుతున్న అధికార అన్నాడీఎంకేకు మళ్లీ మరో సమస్య గేటు ముందే కాచుక్చూర్చోనుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో అన్నాడీఎంకే అడుగులు ఎటుపడతాయన్న చర్చ సర్వత్రాజరుగుతోంది. ఇప్పటికే బీజేపీతో అధికార పార్టీ అంటకాగుతుందన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. నిజానికి ఆ విమర్శలు రావడానికి కూడా కారణాలు లేకపోలేదు. పన్నీర్ సెల్వం, పళని స్వామిని కలిపింది కమలదళమేనన్నది అందరికీ తెలిసిందే.అయితే పళనిస్వామి పార్టీ ఎంపీలను కట్టడి చేయగలరా? అన్న అనుమానం కూడా ఉంది. తమిళనాడులో బీజేపీ కాలుమోపాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తుంది. కాని అది సాధ్యం కాలేదు. బీజేపీకి తమిళనాడులో సరైన ఓటు బ్యాంకు కూడా లేదు. జయలలిత బతికున్నప్పుడు కూడా బీజేపీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అయితే ఇప్పుడు పళనిస్వామి సారథ్యంలో మాత్రం తమిళనాడులో చక్రం తిప్పుదున్నదంగా కమలదళమేనన్న ఆరోపణలు బలంగావిన్పిస్తున్నాయి. తన ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యతను పళని స్వామి మోడీ చేతులోనే పెట్టారన్న ఛలోక్తులు కూడా ఉన్నాయి.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగబోతోంది. రాజ్యసభలో అన్నాడీఎంకేకు పదమూడు మంది సభ్యులున్నారు. జయలలిత ఆశయాలకు విరుద్ధంగా పళనిస్వామి నిర్ణయం తీసుకుంటే వీరు సహకరిస్తారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఇప్పటికే విపక్షాలన్నీకలసి ఉమ్మడి అభ్యర్ధిగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తున్నారు. బీజేపీకూడా ఎన్డీఏ మిత్రపక్షాలను దువ్వుతోంది. మొత్తం 123 మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా ఇటు విపక్షాలకు, అటు అధికారపార్టీకి కూడా తగిన బలం లేదు. ఈనేపథ్యంలో అన్నాడీఎంకే సభ్యుల మద్దతు కీలకంగా మారబోతోంది. పళనిస్వామి త్వరలోనే ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో సమావేశం కావాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుందని, ఎయిమ్స్ ఏర్పాటు, కావేరీ జలాల వివాదంలో చూపిన చొరవే ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పనున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అధికార బీజేపీ వైపే ఉండాలని నిర్ణయించారు. అయితే దినకరన్ ప్రభావం రాజ్యసభ ఎంపీలపై పడకుండా జాగ్రత్త పడేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ముందుగానే చర్యలకు దిగారు. మరి రాజ్యసభ సభ్యుల్లో వీరి మాట ఎంతమంది వింటారో…ఓటింగ్ దాకా సస్పెన్స్ తప్పదంటున్నారు విశ్లేషకులు.