మోడీ మూడు పాయింట్లతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. ఇదే మాస్టర్ ప్లాన్ గా అమలు కాబోతోంది. ప్రస్తుతం మోడీ హవా తగ్గుతోంది. మరింత తగ్గక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది కమలం పార్టీ ఆలోచన. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబరు లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న వార్తలు వచ్చాయి. పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ముందుగానే వెళ్లేందుకు అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు కమలం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.వరుసగా ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, కర్ణాటక ఎన్నికల తర్వాత విపక్షాల్లో ఐక్యత నెలకొనడం కమలం పార్టీని ఆందోళనల్లోకి నెట్టేశాయి. గత ఎన్నికల్లో తమను ఆదుకున్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎదురుగాలులు వీస్తుండటం కమలనాధులను కలవరపెట్టే అంశమే. అందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన పక్కన పెట్టి లోక్ సభ ఎన్నికలకు మరింత ముందుగా వెళ్లాలన్నది మోడీ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కలసి వచ్చే రాష్ట్రాలకు ఎన్నికలు జరపాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే జులై 18 నుంచి ఆగస్టు మొదటి వారం వరకూ జరిగే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత లోక్ సభను రద్దు చేయాలన్న యోచనలో సర్కర్ ఉన్నట్లు ఢిల్లీలో పెద్దయెత్తున ఊహాగానాలు విన్పిస్తున్నాయి.ఆగస్టులో లోక్ సభను రద్దు చేస్తే ఆరు నెలల్లో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. సెప్టెంబరులో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినా అక్టోబర్, నవంబర్ లో ఎన్నికలకు వెళ్లవచ్చన్నది కమలనాధుల వ్యూహంగా ఉంది. ముందస్తు ఎన్నికలకు కలసి వచ్చే రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరిగే ఎన్డీఏ మిత్ర పక్షాలతో పాటుగా ఇతర పార్టీల నేతలను కూడా సంప్రదిస్తారు. ముందస్తు ఎన్నికలకు ఎవరు కలసి వస్తారు? ఎవరు రారన్నది స్పష్టమవుతుంది. తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఓకే అంటున్నారు. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విముఖత చూపుతున్నారు. ఇలా అందరి అభిప్రాయాలను తీసుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వం సీనియర్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మోడీ గ్రాఫ్ మరింత పడిపోక ముందే ఎన్నికలకు వెళ్లడం మేలన్నది సంఘ్ పరివార్ సూచించింది. దీంతో పాటు పెద్దగా సమయం ఇవ్వకపోవడం వల్ల విపక్షాలు బలపడే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. సీట్ల సర్దుబాటు వంటి విషయాల్లో ఎక్కువ సమయం లేకుంటే విపక్షాల్లో అనైక్యత చోటు చేసుకుంటుందని భావిస్తున్నారు. శరద్ పవార్, శరద్ యాదవ్ వంటి నేతలు కూడా ఎన్నికలకు ముందు పొత్తులు కష్టమేనని, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెబుతుండటం గమనార్హం. మహారాష్ట్ర, బీహార్ లో జరుగుతున్న పరిణామాలు కూడా కొంత ఇబ్బంది పెట్టేవే. శివసేన, జేడీయూలు ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాయో చెప్పలేం. ఈనేపథ్యంలో ముందుగానే ముందస్తుకు వెళ్లాలని కమలనాధులు నిర్ణయించినట్లు ఢిల్లీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.