డప ఉక్కు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షను విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి రమేష్, బీటెక్ రవిల దీక్షలను విరమింపజేశారు. అనంతరం ఇద్దరికీ శాలువా కప్పి అభినందించారు. దాదాపు పదకొండు రోజుల తరువాత రమేష్ దీక్షను విరమించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఈనెల 20న సీఎం రమేష్ దీక్షకు దిగారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగించారు. ప్లాంట్ వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం రమేష్ దీక్షకు ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ కోసం దీక్షను చేపట్టిన సీఎం రమేష్, బీటెక్ రవిలను అభినందించారు. మీరు చేపట్టిన దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. మీ దీక్షలు వృథాగా పోవని... కడప ఉక్కు ఫ్యాక్టరీ మీ వల్లే వచ్చిందనే విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.