తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ..ఈ ప్రకటన చేశారు. జనసేనతో కానీ, బీజేపీతో కానీ వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలకు జగన్ తెరదించారు. వచ్చేసారి తమది ఒంటరి పోరే అని జగన్ ఈ విధంగా స్పష్టం చేశారు. వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా అదే మాటే చెప్పారు. ఇక పవన్ కల్యాణ్ మద్దతు విషయంలో కూడా జగన్ స్పందించడం గమనార్హం. జనసేనాధిపతి మీకే మద్దతు పలకనున్నారని మీ పార్టీ ఎంపీ ఒకరు ప్రకటించారు కదా.. అనే అంశంపై జగన్ స్పందిస్తూ, అలాంటి ప్రతిపాదన ఏదీ తన వద్దకు రాలేదని అన్నారు. ఈ విధంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మధ్యలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రేపటి రాజకీయ చిత్రంపై కొంత స్పష్టతను ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీ నేత మధు మాట్లాడుతూ.. దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చేసారి త్రిముఖ పోరు జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ఒక పక్షంగా, కమ్యూనిస్టు పార్టీలు- జనసేన మరో పక్షంగా, వైఎస్సార్సీపీ వేరే పక్షంగా పోటీ చేస్తుందని ఆయన అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులు కలుపుకుపోతారో... ఆ పార్టీ సొంతంగా పోటీ చేసుకోవాల్సి ఉంటుందో! బీజేపీ కూడా ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.