- బుధవారంతో ముగిసిన ఎస్పీ సింగ్ పదవీ కాలం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. ఆయనకు పొడిగింపు లభించకపోవడంతో ఆయన స్థానంలో జోషిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త సీఎస్ ఎస్కే జోషీ 1984 బ్యాచ్‌కు చెందిన వారు. ఎవరీ జోషి? జోషీ యూపీలోని బరేలిలో 1959 డిసెంబర్ 20వ తేదీన జన్మించారు. రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ పొందారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు రైల్వేలో కొన్ని నెలల పాటు పని చేశారు. సికింద్రాబాద్‌లోనే శిక్షణ పొందారు. 1984లో సివిల్ సర్వీస్‌లో చేరారు. మొదట నెల్లూరు అసిస్టెంట్ కలెక్టర్‌గా, తర్వాత తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పని చేశారు.
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా పని చేశారు. ఐటీ, నీటిపారుదల, ఇంధన, రెవెన్యూ, పురపాలక, రెవెన్యూ, వైద్య-ఆరోగ్య శాఖల కార్యదర్శి, ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. ఇప్పుడు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కేంద్ర సర్వీసుల్లో రెండుసార్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో జోషి పని చేశారు. జర్మనీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లోనూ భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. మేనేజ్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్ బౌండరీ వాటర్ రీసోర్సెస్ అనే పుస్తకాన్ని రచించారు. హైదరాబాదును చూడాలన్న తనపతో పాఠశాల స్థాయిలో తెలుగును మూడో భాషగా అభ్యసించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జోషి కృతజ్ఞతలు తెలిపారు. 2019 డిసెంబర్ నెలాఖరు వరకు జోషి సీఎస్ పదవిలో ఉంటారు.