తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో తీర్ధ ప్రసాదాలు అందచేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుమల క్షేత్రం యావత్ ప్రపంచానికి ఒక శక్తిని చాటే ఒక పుణ్యక్షేత్రమని కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడియున్న పుణ్యక్షేత్రమని స్వామి పరిపూర్ణానంద అన్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో తరచూ వస్తున్నటువంటి ఎన్నో వివాదాలు, ఇందులో జరుగుతున్న లోటుపాట్ల పట్ల, ఎన్నో పరిణామాల పట్ల ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న పాలకమండలిలో, నిర్వాహణ విభాగంలో, అర్చకత్వంలో, ఇక్కడి సిబ్బంది లో ఒక సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. ఈ సమన్వయ లోపం వల్ల కోట్లాది మంది భక్తులకు ఒక తప్పుడు సంకేతాలు పంపడం, రకరకాల వివాదాలను సమాజానికి చూపించడమనేది చాలా ఇబ్బందికరమైన విషయమని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సమన్వయ కమిటీని నియమించి ఈ వివాదాలకు తెరదించి సరైన పరిష్కారం చూపాలని స్వామి పరిపూర్ణానంద అన్నారు.