మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నది.పెరిగిన ధరల నేపథ్యంలో భూసేకరణ, పునరావాసం వ్యయం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో పునరావాసంలో భాగంగా పెద్ద ఎత్తున ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ఒక కొలిక్కి వస్తుందనుకున్న నేపథ్యంలో నిధుల సమస్య ఏర్పడిందంటున్నారు. కానీ మరో వైపు కేంద్రం నుంచి సరైన రీతిలో సహకారం లభించని ఫలితంగా నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ఇంకో వైపు నిధుల సమస్య తీవ్రంగా వేధిస్తూనే ఉంది. సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించక పోవడంతో పాటు రాష్ట్రం ఖర్చు చేసిన నిధులకు సైతం ఇంతవరకు పత్తా లేకుండా పోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఉంది. రాష్ట్రానికి ఇంకా కేంద్రం రూ. 1995 కోట్లు దాకా ఇవ్వాల్సి ఉంది. కానీ వీటి అతీగతీ లేదు. కేంద్రం జలవనరుల సంఘం అధికారులు నిర్వహించిన సమావేశంలో కూడా ఈ విషయమై చర్చించినా పెద్దగా పురోగతి లేదంటున్నారు. దీంతో పునరావాస కార్యక్రమాలకు కొంత నిధుల సమస్య ఉన్నా,రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులుతో పునరావాస కార్యక్రమాలతో ముందుకెళుతుందంటున్నారు. నిర్వాసితులకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ వారికి చట్ట ప్రకారం చేయాల్సిన పునరావాస కార్యక్రమాలతో పాటు ఇళ్ల కాలనీల నిర్మాణం, భూమికి భూమి,నష్టపరిహారం,తదితర కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. నిర్దేశిత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ఆంధ్ర జాతికి అంకితం చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరావాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ,ముందుకు వెళుతున్నారు. మారిన కాలమాన పరిసితులు,ధరలు వల్ల భూసేకరణ, పునర్నిర్మాణ, పునరావాస ప్యాకేజీకి రూ. 33,225.74 కోట్లుకు పెరిగిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమిని ఇంకా కొంత మందికి అందజేయాల్సి ఉంది.ఉభయగోదావరి జిల్లాల్లో భూసేకరణ, నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీకి సంబంధించి మొత్తం రూ. 5212.20 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 1991.27 కోట్లు పంపిణీ అయింది. ఇంకా రూ. 3220.93 కోట్లు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 29,816 ఎకరాలు సేకరించి, రూ. 1404 కోట్లకు గాను ఇంకా రూ.86 కోట్లు చెల్లించాల్సి ఉందంటున్నారు. మొత్తం 16,871 మంది నిర్వాసిత కుటుంబాలకు రూ. 2221కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ. 164.60 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా రూ. 2056 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పునరావాసం ప్యాకేజీ భూముల నష్టపరిహారానికి కలిపి మొత్తం రూ. 1482.60 కోట్లు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇంకా రూ.2142.40 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.తూర్పుగోదావరి జిల్లాలో 15,680.02 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఇందుకోసం రూ. 454.02 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.289.07 కోట్లు ఇవ్వాల్సిఉంది. 6187 నిర్వాసిత కుటుంబబాలకు కేవలం రూ. 54.65 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇంకా 4849 కుటుంబాలకు రూ. 839.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ జిల్లాలో భూసేకరణ,పరిహారం , పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇంకా రూ.1078.58 కోట్లను చెల్లించాల్సి ఉందంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం 500 ఎకరాలను మాత్రమే భూమికి భూమిగా ఇచ్చారని తెలిసింది. భూసేకరణ,సహాయ పునరావాస కార్యక్రమాలను 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి చేపట్టాల్సిరావడంతోనే వీటికయ్యే వ్యయం 33వేల కోట్ల రూపాయలకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి నివేదించింది. అంతే కాకుండా పార్లమెంటరీ కమిటీతో పాటు ఎస్టీ కమిటీ, కేంద్ర ఎస్సీ కమిషన్ సహా పలు జాతీయ కమిటీలు నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటించి, రాష్ట్ర భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల పై పూర్తి సంతృప్తిని వ్యక్తంచేశాయి.