శల్య సారథ్యం! ఈ మాట తెలియని తెలుగువారు చాలా అరుదుగా ఉంటారు. యజమాని ఉప్పు తింటూ.. యజమాని నాశనం కావాలని కోరుకున్న వాడే శల్యుడు. మహాభారతంలో కర్ణుడికి రథసారథిగా వచ్చిన శల్యుడు.. అడుగడుగునా కర్ణుడి నాశనాన్ని కోరుకున్నాడు. తీవ్రంగా అవమానించాడు. “నీలో యుద్ధం చేసే లక్షణాలు లేవు“ అంటూ కించ పరిచాడు. ఇలా అడుగడుగునా .. శల్యుడు అవమానించబట్టే.. కర్ణుడు మానసికంగా కుంగిపోయి.. తుదకు పరాజయం పాలయ్యాడు. రాజకీయాల్లోనూ ఇలాంటి శల్యులు చాలా మందే ఉంటారు. పార్టీ జెండా కింద బతుకుతూనే పార్టీ నాశనాన్ని కోరుకుంటారు. పార్టీ ఇచ్చిన పదవులను అనుభవిస్తూనే.. పార్టీ ని బ్యాడ్ చేసేలా వ్యవహరిస్తారు.ఇలాంటి శల్యులు.. ఏపీ అధికార పార్టీలో ఎక్కువగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. వీరిలో ప్రముఖంగా వినిపిస్తు న్న పేరు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిదే! ఈయన అచ్చు శల్యుడికి సోదరుడుగా ఉన్నాడని, పార్టీని మానసికంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను విడిచి పెట్టి టీడీపీలో చేరిన జేసీ.. ఎంపీ కూడా అయ్యారు. అయితే, ఆయన వల్ల టీడీపీ ఎక్కడా అభివృద్ధి కాలేదు. పైగా ఆయన వ్యాఖ్యలతో చంద్రబాబు హర్ట్ అయ్యే పరిస్థితి ఎదురైంది.“ ప్రత్యేక హోదా తీసుకురావడం బాబు వల్లయ్యే పనికాదు. మోడీ బాబు చెప్పినా వినడు. ఆయన బాబు చెప్పినా వినడు“ – అంటూ కించ పరిచేలా వ్యాఖ్యానించారు. మరోసారి.. “బాబు సీఎంగా వేస్ట్. ఆయన మాట ఎవరూ వినరూ. అధికారులు మాత్రం వింటారనుకున్నారా? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. నేతలపైనా బాబుకు పట్టులేదు“ అన్నారు. మరో సందర్భంలో “బాబు మాత్రం తక్కువా? ఆయన డబ్బులు తీసుకోవట్లేదా? డబ్బులు ఇవ్వకుండా టీడీపీకి ఎవరు ఓట్లేసారో చెప్పమనండి“ అన్నారు.ఇటీవల సీఎం రమేష్.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష ప్రారంభిస్తే.. “ఈ మొగోడు దీక్ష చేస్తే.. మోడీ దిగొస్తాడా? ఏం కాదు. ఈయన దీక్ష వేస్ట్. ఈయనగారి వల్ల ఉక్కురాదు.. తక్కురాదు“ అన్నారు. ఇక, నిన్నటికి నిన్న ఢిల్లీలో మరోసారి సమావేశమైన టీడీపీ ఎంపీలతోనూ దీక్షల గురించి చులకనగా మాట్లాడారు. “దీక్షలు చేయండయా? బరువు తగ్గుతారు. ఉక్కు రాదు.. .. తొక్కారాదు!!“అని తీవ్ర వివాదస్పదంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీలో శల్యుడికి సోదరుడున్నాడురా! అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.ఇక ఏదో సీనియర్ అని జేసీని చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకుని ఆయనకు ఎంపీ సీటుతో పాటు ఆయన సోదరుడికి తాడిపత్రి అసెంబ్లీ సీటు ఇస్తే ఇద్దరూ గెలిచారు. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి స్టేట్ వైడ్‌గా నష్టం జరుగుతోంది. ఇక జిల్లాలోనూ ఆయనకు పరిటాలతో, ఇటు అనంతపురం అర్బన్‌లో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పుట్టపర్తిలో పల్లె రఘునాథ్‌రెడ్డితో ఆయనకు విబేధాలు ఉన్నాయి. టోటల్‌గా జేసీ వల్ల టీడీపీకి, బాబుకు లాభం కంటే నష్టమే చాలా ఎక్కువుగా కనిపిస్తోంది. నిజానికి పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు ఏం చేయాలి. పార్టీ అబివృద్ధికి దోహదం చేయాలి. ప్రజలను సమీకరించాలి. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలి. కానీ, జేసీ పరిస్థితి అలా లేదు. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. శల్యుడి మాదిరిగా.. టీడీపీని కించపరిచేలా వ్యాఖ్యానించడం, టీడీపీ సారథి చంద్రబాబు హర్ట్ అయ్యేలా వ్యవహరించడం ఆయనకు అలవాటైపోయింది.