భారతీయులకు అమెరికా ఓ శుభవార్త, ఓ చేదు వార్తను వినిపించింది. ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు ట్రంప్. తద్వారా అత్యంత నిపుణులైన భారతీయులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముంది. ఇది ఒక రకంగా శుభవార్తే. కానీ, అందులో చెడువార్త ఏంటంటే.. ఈ పద్ధతి ద్వారా తన భార్య మినహా తల్లిదండ్రులను, ఇతరత్రా కుటుంబ సభ్యులను తీసుకువెళ్లేందుకు వీలు లేదన్నమాట. ‘స్టేట్ ఆఫ్ ద యూనియన్’ సందర్భంగా మాట్లాడిన ట్రంప్.. ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ‘‘నిపుణులు, మన సమాజానికి ఎంతో కొంత మేలు చేసేవాళ్లు, మన దేశాన్ని ప్రేమించి గౌరవించే వాళ్లకు ఈ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ మేలే చేస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవ్వరూ కూడా తాము కోరుకుంటున్నదే దక్కించుకోలేరని అన్నారు. తాను తెచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పారదర్శకమైనదని, అందులో ఎవరు కోరుకుంటున్నట్టుగా వారికి ఉండదని చెప్పుకొచ్చారు. అమెరికా సభలో ప్రవేశపెట్టబోతున్న ఈ సరికొత్త ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు నాలుగు మూలస్తంభాలున్నాయన్న ఆయన.. వాటిని వివరించారు. ఫస్ట్ పిల్లర్: తల్లిదండ్రులు అక్రమ వలస మార్గాల్లో తీసుకొచ్చిన 18 లక్షల మంది పిల్లలకు (వారినే డ్రీమర్స్ అని పిలుస్తుంటారు) అమెరికా పౌర సత్వం ఇచ్చే మార్గం.
రెండో పిల్లర్: దేశాన్ని, దేశ సరిహద్దులను కాపాడేందుకు దేశ దక్షిణాదిన ఓ పెద్ద, గొప్పదైన గోడ.
మూడో పిల్లర్: వీసా లాటరీలకు చరమ గీతం.
నాలుగో పిల్లర్: చైన్ వలసలకు చెక్ పెడుతూ చిన్న కుటుంబాలకు రక్షణ