పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ నీరవ్ మోదీ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. అతడు ఏ దేశంలో ఉన్నా అరెస్టయ్యే విధంగా ఇంటర్ పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రుణాలు మోసపూరితంగా తీసుకుని ఎగవేసిన సంగతి తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసేందుకు భారత దర్యాప్తు ఏజెన్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అదే క్రమంలో భారత విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలు ఇంటర్ పోల్ సాయం కోరాయి. ఇప్పుడు ఇంటర్‌పోల్ నోటీసు జారీ చేసింది. వివిధ దేశాలను నేరస్థుల అరెస్టులో సాయం చేయమని కోరేందుకు రెడ్‌కార్నర్ జారీ చేస్తారు. దీని ద్వారా ఏ దేశంలో ఉన్నా వాంటెడ్ క్రిమినల్‌ని అరెస్ట్ చేసేందుకు వీలు కలుగుతుంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రూ.13,000 కోట్లకు బ్యాంకింగ్ మోసానికి పాల్పడ్డారు. అతడు పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరిట ఫేక్ గ్యారెంటీలు సమర్పించడం ద్వారా విదేశాల్లో వివిధ బ్యాంకు శాఖల ద్వారా సొమ్మును లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో తీసుకున్నారు. అతడి పాస్‌పోర్ట్ రద్దయినప్పటికీ అదే దాని మీద నీరవ్ విదేశీ ప్రయాణాలు చేశారు. దీంతో నీరవ్ మోదీ ఆచూకీని గుర్తించేందుకు భారత ప్రభుత్వం యూరోపియన్ దేశాలకు లేఖలు రాసింది. అదే విధంగా ఆయా స్థానిక ప్రభుత్వాలతో భారత విదేశాంగ శాఖ నిరంతరం టచ్‌లో ఉంటూ. నీరవ్ మోదీకి ప్రవేశాలను నిరాకరించాల్సిందిగా అభ్యర్థించింది. దాదాపు 6 కేసుల్లో మోస్ట్‌వాంటెడ్‌గా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఉన్నారు. పీఎన్‌బీ కుంభకోణం బయటకు రాకముందే జనవరి మొదటి వారంలో వారిద్దరూ దేశాన్ని వదిలి పారిపోయినట్లుగా గుర్తించారు.