పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కోడి మాంసం కలకలంరేపింది. అలిపిరిలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తిరుమలకి మాంసం తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. అనంతరం ఆ మాంసాన్ని గరుడ పోలీసు విశ్రాంతి భవనం ఎదుట రోడ్డుపై విసిరేశారు. శ్రీవారి దర్శనం కోసం ఆ రోడ్డుపై వెళ్తున్న భక్తులు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మాంసం ముక్కలను గమనించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల క్షేత్రంలో మద్యం, మాంసం, పొగాకు విక్రయం, వాడకం నిషేధం. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులను అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్నంగా తనిఖీ చేసి కొండపైకి వెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ.. సిబ్బంది కళ్లుగప్పి మాంసాన్ని ఎవరు తిరుమలకి తీసుకొచ్చింటారు..? అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా నివాసముండే వారు ఎవరైనా ఈ పనిచేసుంటారా..? అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ మద్యం, పొగాకు తిరుమలలో దర్శనమిచ్చింది. తాజా నేపథ్యంలో.. మరోసారి అలిపిరి వద్ద భద్రతా వైఫల్యం వెలుగుచూసింది.