YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పున: ప్రారంభమైన అమర్ నాధ్ యాత్ర

పున: ప్రారంభమైన అమర్ నాధ్ యాత్ర
జమ్మూ కశ్మీర్‌లో గత మూడు రోజులగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల అమర్‌నాథ్ యాత్రకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో గురువారం ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రను శుక్ర, శనివారాల్లో నిలిపివేశారు. మూడో విడత యాత్రికుల బృందాన్ని సైతం వెనక్కు రప్పించి, టిక్రీ క్యాంప్‌కు తరలించారు. శనివారం మధ్యాహ్నానికి వర్షాలు తగ్గుముఖం పట్టడం, వాతావరణం అనుకూలించడంతో అమర్‌నాథ్‌ యాత్రను పునఃప్రారంభించారు. బల్తాల్‌, పహెల్గామ్‌ మార్గాల్లో భక్తులను యాత్రకు అనుమతించారు. హెలికాప్టర్ల ద్వారా కూడా యాత్రికులను అమర్‌నా‌థ్‌కు చేరుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం నాలుగో బృందం కూడా యాత్రను ప్రారంభించింది. శనివారం ఉదయానికి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహించిన జీలం నది కాస్త శాంతించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని శనివారం నాడు అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు. దాదాపు 3 వేల మంది యాత్రికులతో కూడిన నాలుగో బృందం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్రను ప్రారంభించినట్టు అధికారులు తెలియజేశారు. శనివారం మధ్యాహ్నానికి వర్షాలు తగ్గముఖం పట్టడంతో సైన్యం యుద్ధ ప్రాతిపదికన అమర్‌నాథ్ మార్గంలో సహాయకచర్యలు చేపట్టింది. మధ్నాహ్నమే యాత్రను పున:ప్రారంభించడంతో 587 మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారు. గుహ సమీపానికి పాదరక్షలతో భక్తులను అనుమతించడం లేదు. జూన్ 28 న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 26తో ముగియనుంది. అదే రోజు రాఖీ పండుగ కావడం విశేషం. జమ్మూ కశ్మీర్ గవర్నరే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అధ్యక్షుడిగానూ ఉంటారు. వర్షాల వల్ల నిలిచిపోయిన యాత్రను పున:ప్రారంభించే ముందు రహదారి పరిస్థితి, మరమ్మత్తులను పర్యవేక్షించడానికి సీఈఓగా ఉమాంగ్ నరౌలాను గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా నియమించారు. 

Related Posts