రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కమిషనర్ బి.ఉదయ లక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా 13 జిల్లాలోని 447-ప్రభుత్వ, 150-ఎయిడెడ్ జూనియర్ కళాశాలలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం పొందనున్నారు. ఇప్పటివరకూ 1 నుంచి 10వ తరగతి వరకే మధ్యాహ్న భోజనాన్ని సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యాన అమలు చేస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ వారికీ..దీన్ని విస్తరిస్తున్నారు.ఈ విద్యా సంవత్సర బడ్జెటును రూ.23 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఒక్క కృష్ణాజిల్లాలోనే 25 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల నుంచి 15వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని, పేద, మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలనే లక్ష్యంతో..మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఇంటర్ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఏపీలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1982 నుంచి అమలు చేస్తున్నారు. 2003 నుంచి దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం(1-5 తరగతులు) ప్రారంభించారు. 2008లో 6 నుంచి 8 తరగతులకు, ఆ తర్వాత 9, 10 తరగతులకు దీన్ని విస్తరించారు. 2010-11 నుంచి ప్రత్యేక స్కూళ్ల విద్యారులకూ అమలు చేస్తున్నారు. 2012-13 నుంచి 220 పని దినాల్లోనూ విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు.విద్యార్థులు బడికి సక్రమంగా రావడం, హాజరుశాతం పెంపుదల, బాలబాలికలకు పౌష్టికాహారం అందించాలనేదీ.. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ప్రాథమిక, మాథ్యమిక విద్యార్థులకు సోమవారం-కోడిగుడ్డు, సాంబారు, మంగళవారం-కూరగాయలు, బుధవారం - పప్పు, కూరగాయలు, కోడి గుడ్డు, గురువారం-సాంబారు, శుక్రవారం-కూరగాయాలు, కోడిగుడ్డు, శనివారం-పప్పు, కూరగాయలతో భోజనాన్ని వడిస్తున్నారు. ఇదే మేనునూ కొంచెం మార్పులతో ఇంటర్ విద్యార్థులకూ అమలు చేస్తారని తెలుస్తోంది.